Nitin Gadkari: లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియంలపై చెల్లించే జీఎస్టీని తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. నిర్మల సీతారామన్ అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలు, పన్నుల శ్లాబ్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్‌ను వసూలు చేస్తోన్న తీరు.. మెజారిటీ దేశ ప్రజలనే కాదు.. తోటి కేంద్ర కేబినెట్ మంత్రులకు రుచించట్లేదు. ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా నిర్మల సీతారామన్ జీఎస్టీని వసూలు చేస్తోన్నారని, పన్నుల శ్లాబ్ సిస్టమ్‌నూ ప్రతిపాదించారంటూ విమర్శలను ఎదుర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే ఇప్పుడు తాజాగా తోటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టయింది. జీవిత బీమా, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులపై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తోండటాన్ని ఆయన వ్యతిరేకిస్తోన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. జీవిత బీమా, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుపై జీఎస్టీని ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు. తాను చేసిన ఈ సూచనను ప్రాధాన్యతగా పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ రెండింటిపైనా జీఎస్టీని విధించడం.. సీనియర్ సిటిజన్లకు ఇబ్బందికరంగా పరిణమించిందని పేర్కొన్నారు.
మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ఏకంగా 18 శాతం జీఎస్టీ విధించడం వల్ల దేశ ప్రజల ఆరోగ్య భద్రతను ప్రభావితం చేస్తోన్నట్లు నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. సామాజికపరంగా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికీ అవసరమేనని, ప్రీమియం చెల్లింపులపై జీఎస్టీని వసూలు చేయడం నిరోధకంగా మారిందని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఈ నెల 28వ తేదీన నితిన్ గడ్కరీ ఈ లేఖను నిర్మలా సీతారామన్‌కు పంపించారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బిజినెస్ పోర్టల్ మనీకంట్రోల్ ఈ లేఖ కాపీని సంపాదించింది. ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
Read Also: Chukkala Amavasya 2024 : ఆగస్టు 4న చుక్కల అమావాస్య.. ఆ రోజు ప్రత్యేకత తెలుసా ?
ప్రీమియం చెల్లింపులపై జీఎస్టీని విధించడం సరికాదని, దీనివల్ల బీమారంగం తీవ్రంగా దెబ్బ తింటోందంటూ నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్.. నితిన్ గడ్కరీకి ఇటీవలే ఓ వినతిపత్రాన్ని సమర్పించింది. నాగ్‌పూర్ నుంచే నితిన్ గడ్కరీ లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడం అంటే- ప్రజలను అనిశ్చిత వాతావరణంలోకి నెట్టేసినట్టయిందని, కుటుంబానికి ఎంతో కొంత రక్షణ కల్పించాలనుకునే ప్రతి మధ్య తరగతి కుటుంబీకుడు దీనివల్ల తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారని నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ స్పష్టం చేసింది.
ప్రీమియంపై జీఎస్టీని ఎత్తివేస్తే.. వారిని మళ్లీ లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజీల వైపు ఆకర్షితులను చేయవచ్చని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని నితిన్ గడ్కరీ.. నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో పొందుపరిచారు. ఈ రెండింటి మీద వసూలు చేస్తోన్న 18 శాతం జీఎస్టీని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: Almond Tea: బాదం టీ రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!