Site icon HashtagU Telugu

Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్ర‌భుత్వం కంటే ముందు కూడా నోట్ల ర‌ద్దు!

Demonetisation

Demonetisation

Demonetisation: 2016 నవంబర్ 8 రాత్రి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు (Demonetisation) చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. అయితే భారతదేశంలో మొట్టమొదటగా బ్రిటిష్ కాలంలోనే నోట్ల రద్దు జరిగింది. ఇప్పటివరకు దేశంలో నోట్ల రద్దు ఎన్నిసార్లు జరిగిందో తెలుసుకుందాం.

భారత చరిత్రలో 2016 నాటి నోట్ల రద్దు

భారత చరిత్రలో 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి ఒక మరపురాని సంఘటనగా నమోదైంది. సరిగ్గా 9 ఏళ్ల క్రితం అదే రోజు రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఆ రోజు అర్ధరాత్రి నుండి రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లుబాటు కావని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇదొక అపూర్వమైన చర్య, దీనిని సంక్షిప్తంగా “నోట్ల రద్దు” అని పిలుస్తారు. అయితే నోట్ల రద్దు జరగడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు కూడా భారతదేశంలో నోట్లను రద్దు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పీఎం మోదీకి ముందు ఎన్నిసార్లు నోట్ల రద్దు జరిగిందో తెలుసుకుందాం.

2016 నోట్ల రద్దు ముఖ్య లక్ష్యాలు

మోదీ ప్రభుత్వం 2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి అనేక లక్ష్యాలు ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ వెలుపల నిల్వ చేసిన అక్రమ ధనాన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం లేదా దాన్ని పనికిరాకుండా చేయడం. ఉగ్రవాదం, నక్సలిజంకు జరిగే నిధులను అడ్డుకోవడం. మార్కెట్ నుండి నకిలీ నోట్లను పూర్తిగా తొలగించడం. ఈ నిర్ణయం దేశంలోని సామాన్య ప్రజలు, వ్యాపారాలు, బ్యాంకింగ్ వ్యవస్థపై తక్షణమే ప్రభావం చూపింది. ఫలితంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు సుదీర్ఘ క్యూలు కనిపించాయి.

Also Read: Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

భారత చరిత్రలో మూడు సార్లు నోట్ల రద్దు

2016లో జరిగిన నోట్ల రద్దు మొదటిదని చాలా మంది భావిస్తారు. కానీ అది నిజం కాదు. భారతదేశ చరిత్రలో ప్రధానంగా మూడు సార్లు నోట్ల రద్దు జరిగింది. అయినప్పటికీ ప్రతిసారి దాని పర్యవసానాలు, పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయి.

మొదటి నోట్ల రద్దు: 1946 (బ్రిటీష్ కాలం)

946 జనవరి 4న (స్వాతంత్య్రానికి ముందు) బ్రిటీష్ ప్రభుత్వం నోట్ల రద్దును ప్రకటించింది. రూ. 500, రూ. 1000, రూ. 10,000 నోట్లను అక్రమంగా ప్రకటించారు. పెద్ద మొత్తంలో అక్రమ ధనాన్ని నిల్వ చేసేవారిని అడ్డుకోవడం ఈ నోట్ల ర‌ద్దు ముఖ్య ఉద్దేశం అని అప్ప‌టి అధికారులు ప్ర‌క‌టించారు.

రెండవ నోట్ల రద్దు: 1978 (మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం)

1978 జనవరి 16న (స్వాతంత్య్రం తర్వాత) జనతా పార్టీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, ఆర్థిక మంత్రి చరణ్ సింగ్ పాలనలో నోట్ల రద్దు ఆదేశాలు జారీ అయ్యాయి. రూ. 1000, రూ. 5000, రూ. 10,000 నోట్లను చెలామణి నుండి తొలగించారు.

మూడవ నోట్ల రద్దు: 2016 (మోదీ ప్రభుత్వం)

2016 నవంబర్ 8 రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేశారు. 2016 నోట్ల రద్దు వలన అనేక తక్షణ ఇబ్బందులు వచ్చినా, అది ఒక ముఖ్యమైన సానుకూల మార్పుకు దారితీసింది. దీని తర్వాత దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా పెరిగింది. ప్రజలు క్యాష్‌లెస్ లావాదేవీలను స్వీకరించారు. యూపీఐ (UPI) వినియోగం అనేక రెట్లు పెరిగింది. తద్వారా భారతదేశం డిజిటల్ చెల్లింపులలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచింది.

Exit mobile version