Site icon HashtagU Telugu

DRDO flight test : భారత డ్రోన్ యుద్ధతంత్రానికి కొత్త బలం..కర్నూలులో ULPGM-V3క్షిపణి విజయవంతంగా పరీక్ష

New strength for India's drone warfare strategy.. ULPGM-V3 missile successfully tested in Kurnool

New strength for India's drone warfare strategy.. ULPGM-V3 missile successfully tested in Kurnool

DRDO flight test : భారత సాయుధ దళాల డ్రోన్ యుద్ధతంత్రాన్ని మరింత పదును తేల్చేందుకు మరో కీలక అడుగు వేసింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పాలకొలను సమీపంలోని డీఆర్‌డీవో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్‌ (ఎన్‌వోఏఆర్‌) వేదికగా, యూఏవీ లాంచ్‌డ్‌ ప్రెసిషన్‌ గైడెడ్‌ మిసైల్‌ (ULPGM‑V3) అనే అత్యాధునిక దేశీయ క్షిపణి విజయవంతంగా పరీక్షించబడింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రయోగానికి సంబంధించిన ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఆయుధం, భారత ఆర్మీ, నౌకాదళం, వాయుసేనల సంయుక్త వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేయనుంది.

డీఆర్‌డీవో, స్టార్టప్‌ల భాగస్వామ్యం

ఈ క్షిపణి అభివృద్ధిలో డిఫెన్స్ రీసర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కీలకపాత్ర పోషించగా, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు కూడా ఇందులో భాగస్వాములయ్యాయి. సంక్లిష్టమైన సాంకేతికతను స్వయంగా అభివృద్ధి చేయడంలో భారత్‌కు ఉన్న సామర్థ్యాన్ని ఈ ప్రయోగం మరోసారి రుజువు చేసిందని మంత్రి రాజ్‌నాథ్ అన్నారు.

సాంకేతిక వివరాలు రహస్యంగా ఉంచినప్పటికీ…

ULPGM‑V3 కు సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే గతంలో పరీక్షించిన ULPGM‑V2 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి దీన్ని అభివృద్ధి చేసినట్లు పలు డీఆర్‌డీవో పత్రాలు, ఓపెన్ సోర్స్ సమాచారం సూచిస్తున్నాయి. ఈ క్షిపణి ఫిక్స్‌డ్‌వింగ్‌ మానవరహిత విమానాలను (UAVs) తక్కువ వ్యాసార్థంలోని యుద్ధతలాల్లో ఖచ్చితంగా కూల్చగలదు. తక్కువ ఖర్చుతో తయారు చేయదగిన ఈ ఆయుధం ఫైర్ అండ్ ఫర్‌గెట్ వ్యవస్థతో పనిచేస్తుంది. అంటే ప్రయోగించిన తర్వాత గమ్యం వెంబడించే అవసరం లేదు.

నేషనల్ ఓపెన్ ఏరియా రేంజి (ఎన్‌వోఏఆర్) లో ఘన ప్రయోగం

డీఆర్‌డీవో అధీనంలో ఉన్న ఎన్‌వోఏఆర్, దాదాపు 2,200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (EW) సాంకేతికతల పరీక్షకు ఈ ప్రాంగణం ఎంతో ఉపయోగపడుతోంది. 2016–17లో ప్రారంభమైన ఈ రేంజ్‌ లో రాడార్లు, లేజర్‌ ఆయుధాలు, సెన్సర్లు, యాంటెన్నాలు, ట్రాన్స్‌మిటర్లు వంటి పరికరాలపై అనేక ప్రయోగాలు జరిగాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఇక్కడ Directed Energy Weapons (లేజర్ ఆయుధాలు) ను కూడా పరీక్షించారు. ఇప్పుడు ULPGM-V3 ప్రయోగంతో భారత్‌ డ్రోన్ యుద్ధతంత్రంలో మరో ముందడుగు వేసింది.

తపస్-బీహెచ్‌, ఆర్చర్‌ ఎన్‌జీ యూఏవీలకు ప్రత్యేకంగా

ULPGM శ్రేణి క్షిపణులను తపస్-బీహెచ్‌, ఆర్చర్‌ ఎన్‌జీ వంటి ఆధునిక యూఏవీలకు అనుకూలంగా అభివృద్ధి చేశారు. ఇవి చాలా తక్కువ ఖర్చుతో తయారు అవుతాయి. అత్యంత సమీపంగా ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలవు. తద్వారా చిన్న యుద్ధ మైదానాలలో లేదా సరిహద్దుల్లో జరిగే సున్నిత పరిస్థితుల్లో కూడా ఇది అత్యంత ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది.

నూతన యుగానికి నాంది

ఈ ప్రయోగం ద్వారా భారత్‌ తక్కువ ఖర్చుతో, అధిక ప్రభావంతో పనిచేసే డ్రోన్ ఆధారిత క్షిపణి వ్యవస్థల అభివృద్ధిలో మరో ముందడుగు వేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ రక్షణ రంగంలో దేశీయ టెక్నాలజీకి ఇది భారీ ప్రోత్సాహకంగా నిలిచింది. మొత్తంగా, ULPGM-V3 ప్రయోగం భారత రక్షణ రంగానికి, ముఖ్యంగా డ్రోన్ ఆధారిత యుద్ధతంత్రానికి ఒక మైలురాయిగా అభివృద్ధి చెందనుంది.

Read Also: OTT Apps: ఓటీటీల్లో అశ్లీల చిత్రాలు.. 25 యాప్‌లపై కేంద్రం కొరడా