నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. వీటిలో ప్రధానమైనది ఆధార్ వివరాల సవరణ (Aadhaar Update) ప్రక్రియలో వచ్చిన మార్పు. ఇప్పటి వరకు ఆధార్‌లో పేరు, చిరునామా, జనన తేదీ (DOB), మొబైల్ నంబర్ మార్చుకోవడానికి చాలా సందర్భాల్లో ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు UIDAI (Unique Identification Authority of India) ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా ఈ వివరాలను మార్చుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే దీని కోసం రూ. 75 సేవా రుసుము చెల్లించాలి. బయోమెట్రిక్ (ఫోటో, వేలిముద్రలు, నేత్ర స్కాన్) మార్పుల కోసం మాత్రం ఆధార్ కేంద్రానికే వెళ్లాలి, ఇందుకు రూ. 125 చార్జీ ఉంటుంది. ఈ మార్పులు ప్రజలకు సౌకర్యంగా, సమయాన్ని ఆదా చేసేలా ఉండనున్నాయి.
Suryakumar Yadav: రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన సూర్యకుమార్ యాదవ్!
ఇక బ్యాంకింగ్ రంగంలో మరో ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలకు లేదా లాకర్లకు గరిష్ఠంగా ఒకరు లేదా ఇద్దరినే నామినీలుగా నియమించుకునే అవకాశం ఉండేది. కానీ నవంబర్ 1 నుంచి కొత్త నియమం ప్రకారం ఒక ఖాతాకు నలుగురు నామినీలను నియమించుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఆస్తి వారసత్వ వివాదాలు తగ్గే అవకాశం ఉంది. మరణానంతరం నిధుల పంపిణీ సులభతరం అవుతుంది. ఇది ఖాతాదారులకు మరింత భద్రత కల్పించే విధంగా ఉండనుంది.
ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారులకు సంబంధించిన మరో ముఖ్యమైన నియమం అమల్లోకి వస్తోంది. థర్డ్ పార్టీ యాప్స్ (ఉదా: PhonePe, Paytm, Google Pay) ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్లు చేయడం లేదా రూ.1,000కు పైగా వాలెట్ రీఛార్జ్ చేయడం పై ఇప్పుడు 1 శాతం ఫీజు వసూలు చేయనున్నారు. అంటే విద్యా ఫీజులు లేదా పెద్ద మొత్తంలో డిజిటల్ చెల్లింపులు చేసేవారు ఈ అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం డిజిటల్ ట్రాన్సాక్షన్ ఖర్చులను నియంత్రించడం, బ్యాంక్ సర్వీస్ లాభదాయకతను పెంచడం లక్ష్యంగా తీసుకున్నట్లు భావిస్తున్నారు. మొత్తానికి నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ మార్పులు సాధారణ ప్రజల ఆర్థిక, డిజిటల్ లావాదేవీలలో ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.
