NEET UG 2024 : సుప్రీంకోర్టు ఆదేశాలను నీట్-యూజీ పరీక్షల నిర్వాహక సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అమలు చేసింది. దేశంలోని నగరాలు, ఎగ్జామ్ సెంటర్స్ వారీగా నీట్-యూజీ ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అందులో విద్యార్థుల గుర్తింపును బహిర్గతం చేయలేదు. ఈ వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్‌టీఏ అప్‌లోడ్ చేసింది. మిగతా పరీక్షా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో నీట్-యూజీ(NEET UG 2024) ఎగ్జామ్స్ రాసిన వారికి ఎంతమేర ఎక్కువ మార్కులు వచ్చాయనేది తెలుసుకోవడానికే ఈ జాబితాను సుప్రీంకోర్టు కోరింది. నీట్ యూజీ ఫలితాలను https://neet.ntaonline.in/frontend/web/common-scorecard/index లింక్‌లో అభ్యర్థులు చూడొచ్చు. తదుపరిగా ఈ జాబితాలోని సమాచారాన్ని సుప్రీంకోర్టు విశ్లేషించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై తదుపరిగా జులై 22న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించనుంది.
We’re now on WhatsApp. Click to Join
దేశంలోని 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో ఈ ఏడాది మే 5న నీట్ యూజీ పరీక్షను నిర్వహించారు. దీనికి 24 లక్షల మందికిపైగా హాజరయ్యారు. వీటిలోని 14 పరీక్షా కేంద్రాలు విదేశాల్లో కూడా ఉన్నాయి. నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ సుప్రీంకోర్టులో దాదాపు 40కిపైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని దేశ సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం విచారిస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోని నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా విడుదల చేయాలని ఇటీవల ఎన్టీఏను(NTA) సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. పూర్తిస్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని బలమైన నిర్ధారణకు వస్తేనే మళ్లీ నీట్-యూజీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తామని సుప్రీంకోర్టు ఆ సందర్భంగా స్పష్టం చేసింది.
Also Read :UPSC Chairman : యూపీఎస్సీ ఛైర్మన్ అనూహ్య రాజీనామా.. కారణం అదేనా ?
ప్రస్తుతానికి దేశంలోని మహారాష్ట్ర, బిహార్, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల్లో నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిన వ్యవహారం బయటపడింది. మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలేవీ పెద్దగా వెలుగుచూడలేదు. ఈనేపథ్యంలో యావత్ దేశంలో నీట్-యూజీ పరీక్షను రద్దు చేసే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు. అవసరమైతే ప్రశ్నపత్రాలు లీకైన కేంద్రాల పరిధిలోనే నీట్-యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించే దిశగా మొగ్గుచూపే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.