Narayana Murthy: దేశంలో జనాభా పెరుగుదలపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించిన కాలం నుంచి జనాభా నియంత్రణపై భారతీయులు పెద్దగా శ్రద్ధ పెట్టలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభా మన దేశానికి పెద్ద సవాలుగా మారిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారీ జనాభా, తలసరి భూమి లభ్యత తక్కువగా ఉండటం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కొరత వంటి సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని నారాయణ మూర్తి(Narayana Murthy) పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
జనాభా నియంత్రణ లేకుండా పెరుగుతుండటం వల్ల మనదేశం అభివృద్ధి రేటు దెబ్బతినే అవకాశం ఉందని నారాయణమూర్తి చెప్పారు. మనదేశంతో పోలిస్తే అమెరికా, బ్రెజిల్, చైనా వంటి దేశాలలో తలసరి భూమి లభ్యత ఎక్కువగా ఉందని ఆయన గుర్తు చేశారు. దేశం యొక్క పురోగతికి దోహదపడడమే నిజమైన వృత్తినిపుణుడి బాధ్యత అని ఆయన చెప్పారు. ‘‘ఉన్నతమైన ఆకాంక్షలను కలిగి ఉండాలి. పెద్దగా కలలు కనాలి. అయితే ఆ కలలను వాస్తవంగా మార్చడానికి కృషి కూడా చేయాలి. లేదంటే కలలు నెరవేరవు’’ అని విద్యార్థులకు సందేశమిచ్చారు.
Also Read :GHMC : చెవి కత్తిరించని కుక్కలు కనిపిస్తే చెప్పేయండి..
‘‘దేశంలోని ఒక తరం వారి జీవితాలు బాగుపడాలంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. నా ప్రగతి కోసం నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఉపాధ్యాయులు ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగాలు వృథా కాలేదు అనడానికి నేను ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడమే నిదర్శనం’’ అని నారాయణమూర్తి ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)కి చెందిన 1,670 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు.పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 34 బంగారు పతకాలు పొందగా, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 13 బంగారు పతకాలను అందుకున్నారు.