Nagpur Violence: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న మహల్, హంసాపురి ఏరియాల్లో అల్లర్లు చెలరేగాయి. కొందరు అల్లరి మూకలు పలు దుకాణాలపైకి రాళ్లు రువ్వారు. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. తొలుత ఈ అల్లర్లు మహల్ ఏరియాలో మొదలయ్యాయి. అవే హంసాపురి ఏరియా దాకా విస్తరించాయి. దీంతో నాగ్‌పూర్‌లో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. అత్యవసరం అయితే ఇళ్ల నుంచి బయటికి రావాలని ప్రజలకు పోలీసులు పిలుపునిచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వదంతులను నమ్మొద్దని అన్ని వర్గాల ప్రజలను కోరారు. మహల్, హంసాపురి ఏరియాలు మినహా నాగ్‌పూర్(Nagpur Violence) నగరంలోని మిగతా ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఆ రెండు ప్రాంతాల్లోనూ భారీగా భద్రతా బలగాలను మోహరించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చామన్నారు.
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న ఏరియాలోనే..
అల్లర్లలో పాల్గొన్న 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మిగతా వారిని కూడా పట్టుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. హంసాపురి ప్రాంతంలో అల్లర్లలో పాల్గొన్న వారు ఫేస్ మాస్కులు ధరించి వచ్చారని పోలీసులు గుర్తించారు. వారి చేతిలో తల్వార్లు, కర్రలు, గాజు సీసాలు ఉన్నాయన్నారు. పకడ్బందీ ప్లాన్ ఉన్నందు వల్లే ఫేస్ మాస్కులు ధరించి వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మహల్ ఏరియాలో జరిగిన అల్లర్లలో ఓ వర్గానికి చెందిన దాదాపు 1,000 మంది పాల్గొన్నారని తెలిసింది. నాగ్‌పూర్ ప్రాంత ప్రజలు వదంతులను నమ్మొద్దని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కోరారు. శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులకు సహకరించాలన్నారు. కాగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయం కూడా నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంలోనే ఉంటుంది.
Also Read :Belly Fat: బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ డ్రింక్స్‌తో కొవ్వు తగ్గించుకోండి!
అల్లర్లకు కారణం అదేనా ?
- మహారాష్ట్రలోని ఖుల్దాబాద్‌లో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చేయాలని సోమవారం రోజు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ నేతలు డిమాండ్ చేశారు.
- ‘‘చారిత్రక రికార్డులను కాపాడేందుకు మాత్రమే మేం ఔరంగజేబు సమాధిని రక్షిస్తున్నాం. అంతే తప్ప ఔరంగజేబుపై గౌరవంతో కాదు’’ అని సోమవారం రోజు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.
- సోమవారం రోజు నాగ్‌పూర్‌లోని మహల్ ఏరియాలో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం సమీపంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో వారు ఓ మతానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని కాల్చారు అంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో సోమవారం రాత్రి మహల్ ఏరియాలో ఉద్రిక్తత ఏర్పడింది.
- తమ మతగ్రంథాన్ని కొందరు తగలబెట్టారు అంటూ ఓ వర్గం వారి నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది.
- వదంతులు నిజమే అని నమ్మిన ఓ వర్గం ప్రజలు నిరసన తెలిపేందుకు రోడ్డుపైకి వచ్చారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈక్రమంలోనే పలువురు నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఇంకొందరు వాహనాలకు నిప్పుపెట్టారు.
- పోలీసుల లాఠీఛార్జిలో 20 మందికి గాయాలయ్యాయి.
- మహల్ ఏరియాలో మొదలైన అల్లర్లు ఆ తర్వాత కోత్వాలీ, గణేష్‌పేట్ ప్రాంతాలకు విస్తరించాయి.
- అల్లర్లలో పాల్గొన్న వారిని వెంటాడి పట్టుకునే క్రమంలో డీసీపీ నికేతన్ కదమ్‌కు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.
- శుక్రవారీ తలావ్‌రోడ్‌లోని ఛిత్నిశ్ పార్క్ వద్ద కూడా అల్లర్లు జరిగాయి.