Site icon HashtagU Telugu

Nagaland: ప్రతిపక్షమే లేని ప్రభుత్వం.. ఎక్కడో తెలుసా?

Nagaland Heading For Opposition Less govt

Nagaland Heading For Opposition Less govt

ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత కీలకమో.. ప్రతిపక్షానికీ అంతే ప్రాధాన్యత ఉంటుంది. బలమైన విపక్షం.. ప్రజాస్వామ్య పునాదులను మరింత బలోపేతం చేస్తుందంటారు రాజ్యాంగ నిపుణులు. ఏ రాష్ట్రంలో అయినా.. ప్రతిపక్షం లేని ప్రభుత్వం చాలా అరుదు. తాజాగా ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో (Nagaland) విపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.

నాగాలాండ్‌ (Nagaland) అసెంబ్లీ చరిత్రలో తొలిసారి అరుదైన ఘట్టం చోటుచేసుకుంటోంది. అత్యధిక రాజకీయ పార్టీలు ఉన్న ఈ ఈశాన్య రాష్ట్రంలో ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటవుతోంది. అన్ని పార్టీలు అధికార ఎన్డీపీపీ-బీజేపీ కూటమికి బేషరతుగా మద్దతు ప్రకటించాయి. నాగాలాండ్‌లో 2015, 2021లో ప్రతిపక్షాలు లేని ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ప్రమాణ స్వీకారానికి ముందే విపక్షం లేని శాసనసభ ఏర్పాటు కానుండడం మాత్రం ఇదే తొలిసారి.

60 మంది సభ్యులున్న నాగాలాండ్ (Nagaland) అసెంబ్లీకి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగ్గా.. మార్చి 2న ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల ముందే కూటమి కట్టిన అధికార ఎన్డీపీపీ 25, బీజేపీ 12 స్థానాల్లో విజయఢంకా మోగించాయి. ఎన్సీపీ 7, ఎన్పీపీ 5, ఎల్జేపీ 2, ఎన్పీఎఫ్ 2, ఆర్పీఐ 2 జేడీయూ ఒక స్థానం గెలుచుకున్నాయి. నలుగురు ఇండిపెండెంట్లు సైతం విజయం సాధించారు. అయితే ఈ పార్టీలన్నీ ఎన్డీపీపీ- బీజేపీ కూటమికి ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి.

ఎల్జేపీ, ఆర్బీఐ అథవాలే పార్టీలు కేంద్రంలోని ఎన్డీఎ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. కాబట్టి నాగాలాండ్‌లోనూ ఈ పార్టీలు బీజేపీ కూటమికి జైకొట్టాయి. అయితే, శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ, నితీశ్ కుమార్‌ జేడీయూ-ఎన్డీపీపీ-బీజేపీ కూటమికి మద్దతివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కూటమి ప్రభుత్వానికి ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇస్తున్నట్లు పార్టీ హైకమాండ్‌ లేఖను సమర్పించిందని NCP ఎమ్మెల్యే మొంబెమో తెలిపారు . నాగాలాండ్‌తోపాటు త్రిపుర, మేఘాలయ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. త్రిపురలో సొంతంగా మెజార్టీ సాధించగా.. మేఘాలయలో రెండు స్థానాలు గెలిచి ఎన్‌పిపి ప్రభుత్వానికి కమలదళం మద్దతిస్తోంది .నాగాలాండ్‌, మేఘాలయల్లో మంగళవారం, త్రిపురలో బుధవారం కొత్త ప్రభుత్వాలు ఏర్పాటుకానున్నాయి. ఈ ప్రమాణస్వీకారోత్సవాలకు ప్రధాని మోదీ స్వయంగా హాజరుకానున్నారు.

Also Read:  Ahmedabad Pitch: అహ్మదాబాద్‌ పిచ్‌ రిపోర్ట్ క్యా హై?