Mumbai Alert : కేంద్ర నిఘా వర్గాల నుంచి దేశ వాణిజ్య రాజధాని ముంబై (Mumbai) పోలీసులకు కీలక సమాచారం అందింది. ముంబై నగరానికి ఉగ్రదాడుల ముప్పు ఉందనేది ఆ సమాచారం సారాంశం. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముంబై నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. త్వరలో పండుగల సీజన్ కూడా ఉన్నందున అలర్ట్‌గా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు(Mumbai Alert) సూచించినట్లు తెలుస్తోంది. మతపరమైన ప్రదేశాలు, జనం భారీగా ఉండే మార్కెట్ ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సమాచారం అందడంతో ఆయా చోట్ల భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈక్రమంలోనే ముంబైలోని పలుచోట్ల పోలీసులు మాక్ సెక్యూరిటీ డ్రిల్స్ కూడా నిర్వహించి తమ సన్నద్ధతను చాటుకుంటున్నారు. నగరంలోని జుహు ఏరియాలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ వద్ద పోలీసు డ్రిల్ జరిగింది. ముంబైలోని భౌచా ధక్కా, బర్కత్ అలీ రోడ్, జవేరీ బజార్ ఏరియాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారాన్ని చేరవేయాలని మతపరమైన ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాల నిర్వాహకులకు పోలీసులు సూచనలు జారీ చేశారు.
Also Read :Hezbollah Head : హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మిస్సింగ్ ? బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
దుర్గా పూజ, దసరా, దీపావళి పండుగలు సమీపించిన తరుణంలో ఉగ్రదాడుల ముప్పు ఉందనే హెచ్చరికలు జారీ కావడంతో ముంబై పోలీసు విభాగం హైఅలర్ట్‌పై ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం రోజు కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లతో పాటు ఓటర్ల కోసం ఏర్పాటు చేయాల్సిన వసతులపై ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల టైంలో ముంబైలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారని గుర్తు చేశారు. ఆ పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల టైంలో మళ్లీ తలెత్తకుండా చూడాలని అధికారులకు సీఈసీ రాజీవ్ కుమార్ నిర్దేశించారు.