Water Crisis: బెంగళూరులో మరింత తీవ్రమైన నీటి సంక్షోభం

  • Written By:
  • Updated On - March 13, 2024 / 12:09 PM IST

 

Water Crisis: కాంగ్రెస్‌ పాలిత కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు నగరం (Bengaluru)లో నీటి సంక్షోభం (Water Crisis) మరింత తీవ్రమైంది. తాగు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగానే బోర్లు ఎండిపోవడంతో నగరంలో ఈ పరిస్థితి నెలకొంది. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడిందంటే నగరంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. అటు నగర జలమండలి కూడా సరిపడా నీటిని సరఫరా చేయడం లేదు. దీంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి. దీంతో డిమాండ్‌ ఎక్కువవడంతో ట్యాంకర్ల ధరలు అమాంతం పెంచేశారు.

We’re now on WhatsApp. Click to Join.

నగరంలో రోజుకు 2,600-2,800 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటి అవసరం ఉంటే ఇప్పుడు దాదాపుగా 1,300 ఎంఎల్‌డీ నీరు మాత్రమే సరఫరా అవుతోంది. అంటే, అవసరమైన నీటిలో సగం కూడా సరఫరా జరగడం లేదు. మరోవైపు ఎండాకాలం ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోవు రోజుల్లో పరిస్థితి ఇంకా ఎంత స్థాయికి దిగజారుతుందోనని నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ప్రతి నీటి బొట్టును వృథాగా పోకుండా జాగ్రత్తగా వాడుకుంటున్నారు. ఎండాకాలం అయినప్పటికీ నెలకు ఐదు సార్లు మాత్రమే స్నానాలు చేస్తున్నామని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వంట వండటం, గిన్నెలు తోమడం వంటి వాటికి నీరు ఎక్కువగా అవసరం ఉండటంతో.. ఫుడ్‌ను బయట నుంచి ఆర్డర్‌ పెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. నివాసితులు ఎక్కువగా ఉన్న కమ్యూనిటీల్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. రోజుకు నాలుగు నుంచి ఐదు ట్యాంకులు అవసరం ఉండగా.. ఒకటి లేదా రెండు ట్యాంకులు మాత్రమే సరఫరా అవుతున్నాయి. దీంతో గత మూడు నెలలుగా తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు కమ్యూనిటీల్లో నివసించే ప్రజలు వాపోతున్నారు.

read also: No To Salary : దేశం కోసం శాలరీ వదులుకుంటా.. అధ్యక్షుడి ప్రకటన

మళ్లీ వర్షాలు పడితే తప్ప పరిస్థితి మామూలు స్థితికి వచ్చేలా కనిపిచండం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పాలకుపై ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. వరుసగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న తీరులోనే సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఏ ప్రభుత్వమూ కూడా ప్రజల శ్రేయస్సును పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లు, రోడ్లను నిర్మించడంపైనే దృష్టి పెడుతున్నారని, భూగర్భజలాలపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.