Mock drill : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఈ దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. యుద్ధం పొంచి ఉన్నదన్న వాదనలు ఊపందుకున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
Read Also: NTR Birthday : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా?
ఈ నెల 7వ తేదీన దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించనున్నారు. మొత్తం 259 జిల్లాల్లో జరిగే ఈ డ్రిల్‌లో వైమానిక దాడులు జరిగే సమయంలో ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకునేలా సైరన్లు మోగించడం, ప్రజలకు, విద్యార్థులకు రక్షణ విధానాలపై శిక్షణ ఇవ్వడం వంటి అంశాలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ఎక్కడకు తరలించాలి అనే అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించనున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నేడు రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించింది. రేపు జరిగే డ్రిల్‌కు సంబంధించిన ఏర్పాట్లు, నిర్వహణ విధానాలపై సమీక్ష జరిపారు. రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉన్న సుస్థిర ఆదేశాలు జారీచేశారు. మాక్ డ్రిల్ పేరుతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు రంగంలోకి దిగనుండటంతో ప్రజల్లో కొంత భయాందోళనలు నెలకొన్నాయి.
ఇంతలోనే పాకిస్తాన్ మాత్రం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు కొనసాగిస్తోంది. నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సైన్యంపై దాడులకు పాల్పడుతోంది. ఈ దాడులకు ప్రతిగా భారత్ కూడా తీవ్ర ప్రతిస్పందనకు సిద్ధమవుతోందని సమాచారం. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ భయాలు మరింత ముదురుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం తీసుకుంటున్న చర్యలు, మాక్ డ్రిల్‌ల నిర్వహణ, రాష్ట్ర అధికారులతో సమీక్షలు ఇవన్నీ భారతదేశం యొక్క సంసిద్ధత స్థాయిని సూచిస్తున్నాయి. ఇది దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తగా భావించవచ్చు.
Read Also: Supreme Court : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు.. సీజేఐ ఆస్తుల విలువెంతో తెలుసా..?