Missed IT Deadline: గడువు తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారా? ఇవి తెలుసుకోండి!!

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే గడువు ముగిసింది. ఇలా గడువు తర్వాత రిటర్న్స్ ఫైల్ చేసేవారు.. ఛార్జీలు చెల్లించడంతో పాటు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కోల్పోవాల్సి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - August 2, 2022 / 07:45 AM IST

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే గడువు ముగిసింది. ఇలా గడువు తర్వాత రిటర్న్స్ ఫైల్ చేసేవారు.. ఛార్జీలు చెల్లించడంతో పాటు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కోల్పోవాల్సి ఉంటుంది. గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసేవారి వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉంటే రూ.1,000 జరిమానా చెల్లించాలి. వార్షికాదాయం రూ.5,00,000 కన్నా ఎక్కువగా ఉంటే రూ.5,000 జరిమానా చెల్లించాలి. అంటే ఇప్పుడు రిటర్న్స్ ఫైల్ చేసేవారు వారి వార్షికాదాయాన్ని బట్టి రూ.1,000 లేదా రూ.5,000 జరిమానా చెల్లించడం తప్పనిసరి. కనీస మినహాయింపు పరిమితి
రూ.2,50,000 ఉన్నవారు ఐటీఆర్ ఫైల్ చేస్తే ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ లిమిట్ వృద్ధులకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంది.

పన్నులు చెల్లించాల్సి ఉంటే..

ఇక రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఏవైనా పన్నులు చెల్లించాల్సి ఉంటే నెలకు 1 శాతం చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 2022 ఏప్రిల్ 1 నుంచి పన్నులు రూ.10,000 లోపు ఉన్నవారికే ఇది వర్తిస్తుంది. ఒకవేళ పన్నులు రూ.10,000 దాటి, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించనట్టైతే పెనాల్టీ నెలకు 1 శాతం చొప్పున వర్తిస్తుంది.

అడ్వాన్స్ ట్యాక్స్..

అడ్వాన్స్ ట్యాక్స్ విషయానికి వస్తే సంబంధిత ఆర్థిక సంవత్సరంలో జూలై 15 లోపు 30 శాతం, డిసెంబర్ 15 లోపు 60 శాతం, మార్చి 31 లోపు 100 శాతం ట్యాక్స్ చెల్లించాలి. కొందరు కొంత సమాచారంతో లేదా రిటర్న్స్ చూపించకుండా జూలై 31 లోపు రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారని, రూ.5,000 ఫైన్ తప్పించుకోవడానికి ఇలా చేస్తుంటారని, వారంతా ఆగస్టులోగా రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.

ఈ బెనిఫిట్స్ కోల్పోతారు..

* గడువు తర్వాత రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా కొన్ని బెనిఫిట్స్ కోల్పోవాల్సి ఉంటుంది. డెడ్‌లైన్ లోపు రిటర్న్స్ ఫైల్ చేస్తే మాత్రమే అసెస్‌మెంట్ ఇయర్ 2030-31 వరకు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ అమ్మకాలపై వచ్చే నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు.
* గడువులోగా రిటర్న్స్ ఫైల్ చేయని వారు, నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటే కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్‌కు క్షమాపణ విజ్ఞప్తి లేఖ రాయొచ్చు.
* రిటర్న్స్ ఆలస్యంగా ఫైల్ చేస్తే ట్యాక్స్ రీఫండ్‌పై వడ్డీ కూడా రాదు.
* మీరు ఏదైనా డిడక్షన్స్ క్లెయిమ్ చేయాలనుకున్నా, ఇతర ఆదాయాలు ఏవైనా చూపాలనుకున్నా బిలేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు.
* గడువు తర్వాత రిటర్న్స్ ఫైల్ చేసినవారికి 2022 డిసెంబర్ 31 వరకు రివైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది

5.78 కోట్ల ఐటీ రిటర్న్స్..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ప్రకారం.. జూలై 31న రాత్రి 11 గంటల వరకు 5.78 కోట్ల ఐటీ రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. చివరి రోజే 67 లక్షలకు పైగా రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. గతేడాది ఐటీ రిటర్న్స్ లెక్క చూస్తే డిసెంబర్ 31 నాటికి 5.9 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేశారు. 2022 మార్చి 15 నాటికి 66.3 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేశారు. అంటే గడువు ముగిసిన తర్వాత కూడా ఫైన్ చెల్లించి ఐటీఆర్ ఫైలింగ్ చేసినవాళ్లు ఉన్నారు.