Death Sentence In Qatar : ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన 8 మంది భారత మాజీ నేవీ సిబ్బందిని రక్షించే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఈక్రమంలో సోమవారం ఆ ఎనిమిది కుటుంబాలను భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పరామర్శించారు. మాజీ నేవీ సిబ్బంది అందరినీ విడిపించి, దేశానికి తీసుకొచ్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కేసుకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తేల్చి చెప్పారు. కుటుంబాల ఆందోళనను తాను అర్థం చేసుకోగలనని జైశంకర్ తెలిపారు. దీనిపై తాను స్వయంగా బాధిత కుటుంబాలతో టచ్‌లో ఉంటానని వెల్లడించారు. వారితో భేటీ అనంతరం ఈమేరకు వివరాలతో ఆయన ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఖతార్‌లో ఓ ప్రైవేటు సైనిక శిక్షణ సంస్థ తరఫున పనిచేస్తూ.. ఆ వివరాలను ఇజ్రాయెల్‌కు అందించారనే అభియోగాలతో 8 మంది భారత మాజీ నేవీ సిబ్బందికి ఖతార్ కోర్టు గతవారం మరణశిక్ష విధించింది. దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తూ.. ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేశారనే అభియోగాలు నిరూపితం కావడంతో ఖతర్ కోర్టు శిక్ష విధించింది. వాస్తవానికి వారిని 2022 ఆగస్టులోనే అదుపులోకి తీసుకొని జైలులో ఉంచారు. దాదాపు ఏడాది తర్వాత న్యాయవిచారణ పూర్తి కావడంతో గతవారం కోర్టు శిక్షను ఖరారు చేసింది. అయితే వీరిపై వచ్చిన ఆరోపణలను ఖతార్ అధికారులు ఇంకా బహిరంగపర్చలేదు. ఈ శిక్షను ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ సిబ్బందిలో విశాఖపట్నానికి చెందిన సుగుణాకర్ పాకాలతో పాటు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్(Death Sentence In Qatar) ఉన్నారు.