Akash Anand : ఆకాశ్ ఆనంద్.. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మేనల్లుడు. ఆయనకు గతంలో కీలకమైన పార్టీ పదవిని మాయావతి ఇచ్చారు. కొంత కాలానికే ఆ పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు మరోసారి మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పిలిచి మరీ, బీఎస్పీలో నంబర్ 2 స్థాయి కలిగిన జాతీయ ముఖ్య సమన్వయకర్త పోస్టును ఆయనకు మాయావతి కట్టబెట్టారు. ఈ పదవిలో ఉంటూ బీఎస్పీలోని ముగ్గురు జాతీయ సమన్వయకర్తలు రాంజీ గౌతమ్, రణధీర్ బేణీవాల్, రాజారామ్‌లకు ఆకాశ్ మార్గనిర్దేశనం చేయనున్నారు. కీలక బాధ్యతలను ఆకాశ్‌కు అప్పగించడం ద్వారా తన రాజకీయ వారసుడు ఆయనే అని పార్టీ శ్రేణుల్లోకి మాయావతి స్పష్టమైన సిగ్నల్స్‌ను పంపారు. ఇంతకీ మరోసారి ఆకాశ్‌పై మాయావతికి నమ్మకం ఎలా కుదిరింది ? ఈసారి బీఎస్పీ నంబర్ 2 స్థాయి పోస్టును ఆయనకు ఎందుకు ఇచ్చారు ? చూద్దాం..
Also Read :YS Jagan Vs Arrest : వైఎస్ జగన్‌కు అరెస్టు భయం పట్టుకుందా ? అందుకేనా ఈ ఏర్పాట్లు ?
వారసత్వ రాజకీయాలపై యూటర్న్ ?
వాస్తవానికి బీఎస్పీ అధినేత్రి మాయావతికి వారసత్వ రాజకీయాలు అంటే ఇష్టం ఉండదు. ఆమె కూడా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే దిగ్గజ నాయకురాలిగా ఎదిగారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేరువ అయ్యారు. దళిత, మైనారిటీ, బీసీలతో కూడిన బహుజన వర్గానికి ఆశాజ్యోతిగా మాయావతి ఉదయించారు. తన రాజకీయ వారసత్వాన్ని ఎవరికీ ఇచ్చేది లేదని కొన్ని నెలల క్రితమే ఆమె తేల్చి చెప్పారు. మరి ఇప్పుడు మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌కు(Akash Anand) బీఎస్పీలో నంబర్ 2 పోస్టును ఎందుకు ఇచ్చారు ? ఆయన కోసం ప్రత్యేక పోస్టును ఎందుకు క్రియేట్ చేశారు ? బీఎస్పీలో అత్యంత సీనియర్లు చాలామంది ఉన్నారు.. వారిలో నుంచి ఒకరికి ఈ పోస్టును ఎందుకు ఇవ్వలేదు ? అనే ప్రశ్నలకు మాయావతి నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తన బంధువులకే బీఎస్పీపై పట్టు కొనసాగాలనే ఆలోచన, విజన్ మాయావతికి ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిఖార్సయిన యోగి ఆదిత్యనాథ్ లాంటి నేతలకు కీలక అవకాశాలను ఇస్తున్న బీజేపీని యూపీలో ఢీకొనాలంటే.. నిఖార్సయిన నేతలకే బీఎస్పీ కూడా అవకాశాలు ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
Also Read :Army Jawan Suicide : జమ్మూకశ్మీరులో తెలంగాణ జవాన్ ఆత్మహత్య.. కారణమిదీ
అప్పట్లో ఆ కారణంతో వేటు
గతంలోనూ బీఎస్పీలో కీలకమైన పోస్టును ఆకాశ్ ఆనంద్‌కు మాయావతి ఇచ్చారు. అయితేే అప్పట్లో ఆకాశ్ ఆనంద్ మామ పార్టీ వ్యవహారాల్లో తల దూరుస్తున్నట్లు ఒక నివేదిక మాయావతికి అందింది. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన మాయావతి.. అప్పట్లో ఆయన్ను పదవి నుంచి తప్పించారు. ఈసారి మునుపటి కంటే పవర్ ఫుల్ పోస్టుతో ఆకాశ్ ఆనంద్‌కు బీఎస్పీలోకి ఎంట్రీ కల్పించారు.
బిహార్ పోల్స్ నుంచి లెక్క షురూ
2027లో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు బీఎస్పీకి చాలా కీలకమైనవి. ఆ ఎన్నికల్లో పార్టీ తప్పకుండా రాష్ట్రంలో ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మాయావతి వయసు 69 సంవత్సరాలు. 2027 నాటికి ఆమె 71వ వసంతంలోకి అడుగు పెడతారు. అందుకే ముందుచూపుతో బీఎస్పీ పగ్గాలను యువ నాయకత్వానికి అప్పగించాలని ఆమె డిసైడయ్యారట. ఈ ఏడాది చివర్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలపైనా ఆకాశ్ కసరత్తు చేయబోతున్నారట. ఈదఫా ఆకాశ్ తనదైన శైలిలో చక్రం తిప్పే అవకాశం ఉంది. తనకు వ్యతిరేకంగా పార్టీలో ప్రచారం చేసేందుకు యత్నిస్తున్న వారిని గుర్తించే ఛాన్స్ ఉంది. ఇక ఇదే సమయంలో బీఎస్పీ కోసం మెరుగైన ఫలితాలను సాధించి మాయావతి మెప్పు పొందేందుకు ఆకాశ్ యత్నించొచ్చు.