Site icon HashtagU Telugu

Encounter : భారీ ఎన్‌కౌంటర్..8 మంది మావోయిస్టులు మృతి

Massive encounter - 8 Maoists killed

Massive encounter - 8 Maoists killed

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని, అడవుల్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. దాదాపు నాలుగున్నర గంటలపాటు ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం అంతా తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లింది. అయితే ఈ మృతుల్లో మావోయిస్టు ముఖ్య నేత ఉన్నట్లు తెలుస్తోంది.

బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లాయి. ఈ క్రమంలోనే అడవుల్లో నక్కి ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు బీజాపూర్ పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూర్‌ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది.

ఇటీవల కాలంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగులుతున్నది. పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి చలపతితో పాటు 16 మంది వరకు మావోలు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. తాజాగా జరిగిర ఎన్‌కౌంటర్‌లో మరో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 2026, మార్చి మాసాంతానికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే దాదాపుగా మావోయిస్టులు తుడుచు పెట్టుకు పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మాత్రం వారి జాడ ఇంకా ఉంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. అందులోభాగంగా మావోయిస్టులు లొంగి పోయి జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే.

Read Also: Delhi vs Railways: విరాట్ కోహ్లీకి గిఫ్ట్ ఇచ్చిన ఢిల్లీ.. రైల్వేస్‌ ఇన్నింగ్స్ తేడాతో చిత్తు!