Manoj Verma as Kolkata Police Commissioner: కోల్‌కతా పోలీస్ కమిషనర్ గా ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. మనోజ్ వర్మకు పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది.
Read Also: Bajaj New Motorcycles : బజాజ్ నుంచి రెండు కొత్త 400 సీసీ బైక్స్.. ఫీచర్లు ఇవే
కాగా, అంతకుముందు కోల్‌కతా సీపీగా ఉన్న వినీత్ గోయల్‌కు ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఆందోళన చేస్తున్న వైద్యుల అభ్యర్థన మేరకు వినీత్ గోయల్‌ను విధుల నుంచి తప్పించింది. ఆయనతోపాటు వైద్య శాఖకు చెందిన పలువురు అధికారులను కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వారి స్థానంలో కొత్త అధికారులను నియమించనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగానే కోల్‌కతా సీపీగా మనోజ్ కుమార్ వర్మను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు జూనియర్ డాక్టర్ల ఆందోళన కొలిక్కి వచ్చింది. కోల్‌కతాలో నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల డిమాండ్లు నెరవేర్చేందుకు దీదీ ప్రభుత్వం అంగీకరించింది. నాలుగుసార్లు రద్దు అయిన తర్వాత సోమవారం రాత్రి జూనియర్ డాక్టర్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో వైద్యులు ఐదు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఐదు డిమాండ్లలో మూడింటికి మమతా సర్కార్ అంగీకరించింది. ఈ మేరకు వారి డిమాండ్లు నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వైద్యులతో సమావేశం ముగిసిన గంటల వ్యవధిలోనే కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, వైద్యశాఖకు చెందిన ఇద్దరు అధికారులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.