Manipur CM Resignation: మెయితీ, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలతో దాదాపు రెండేళ్లు అట్టుడికిన మణిపూర్‌లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నేత ఎన్.బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో అందజేశారు. బీరేన్ సింగ్ రాజీనామా లేఖను సమర్పించిన సమయంలో, ఆయన వెంట బీజేపీ, ఎన్‌పీఎఫ్ పార్టీలకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, మణిపూర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎ.శారద, పార్టీ సీనియర్ నేత సంబిత్ పాత్ర ఉన్నారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించిన వెంటనే బీరేన్ సింగ్ నేరుగా సీఎం సచివాలయానికి వెళ్లారు.
రాజీనామా లేఖలో..
బీరేన్ సింగ్ తన రాజీనామా లేఖలో.. ‘‘మణిపూర్ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించినందుకు నేను గర్విస్తున్నాను. నాకు ఇన్నాళ్లూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. మణిపూర్ డెవలప్‌మెంట్ కోసం నేను చేపట్టిన చాలా ప్రాజెక్టులకు కేంద్ర సర్కారు నుంచి పూర్తి సహకారం లభించింది’’ అని ప్రస్తావించారు.
Also Read :Thursday: గురువారం రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎలాంటి సమస్యలైనా మాయం అవ్వాల్సిందే!
కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి ఒకరోజు ముందు..
- ఫిబ్రవరి 10 నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
- ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీరేన్ సింగ్ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రోజు (ఫిబ్రవరి 7న) ప్రకటించింది.
- ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై శనివారం రోజు (ఫిబ్రవరి 8న) ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలతో బీరేన్ సింగ్ చర్చించారు.
- ఇవాళ(ఫిబ్రవరి 9న) ఉదయం ఢిల్లీలో బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలతో బీరేన్ సింగ్ భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఇంఫాల్‌కు చేరుకున్న వెంటనే ఆయన గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.
- అసెంబ్లీ సెషన్‌కు సరిగ్గా ఒకరోజు ముందు ఆయన రాజీనామా చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
బీరేన్ సింగ్ ఆడియో క్లిప్స్ దుమారం
మణిపూర్ హింసాకాండ వేళ కుకీ తెగకు వ్యతిరేకంగా మెయితీ తెగను రెచ్చగొట్టేలా బీరేన్ సింగ్ మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ అంశం ఇటీవలే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. ఆ ఆడియో క్లిప్‌లను శాస్త్రీయంగా తనిఖీ చేసి, అందులో ఉన్న గొంతు బీరేన్ సింగ్‌దా ? కాదా ? అని తేల్చాలని సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిణామం జరిగి వారమైన గడవకముందే బీరేన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయడం గమనార్హం. బీజేపీ హైకమాండ్ సూచనల మేరకే ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత ఏడాది కాలంగా బీరేన్ సింగ్‌ను సీఎం పదవి నుంచి తప్పించేందుకు బీజేపీ పెద్దలు యత్నిస్తున్నారు. అయితే బీరేన్ పదేపదే నో చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆడియో క్లిప్ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న తరుణంలో ఆయన సీఎం(Manipur CM Resignation) పదవిని వదులుకునేందుకు సిద్ధం కావడం గమనార్హం.