Funny Complaint : ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్ నిజంగా అవసరమైన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాల్సింది. కానీ కొందరు మాత్రం అతి చిన్న విషయాలను కూడా హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులుగా పంపడం వింతగా మారుతోంది. అలాంటి అరుదైన సంఘటన తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భింద్ జిల్లాలో చోటుచేసుకుని, స్థానికంగా చర్చనీయాంశమైంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భింద్ జిల్లా గ్రామపంచాయతీ భవనంలో జెండా వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమం అనంతరం ఆచారప్రకారం అక్కడికొచ్చిన గ్రామస్తులకు లడ్డూలు పంచిపెట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో కమలేశ్ ఖుష్వాహా అనే గ్రామస్థుడి వంతు వచ్చింది. సిబ్బంది అతనికి ఒక లడ్డూ అందజేశారు.
అయితే, తనకు రెండు లడ్డూలు కావాలని కమలేశ్ పట్టుబట్టాడు. సిబ్బంది “ఒక్కొక్కరికి ఒక లడ్డూ మాత్రమే” అని చెప్పడంతో, ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే పంచాయతీ భవనం బయటకు వచ్చి ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. “జెండా వందనం తర్వాత స్వీట్లు సరిగా పంచడం లేదు, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి” అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి రవీంద్ర శ్రీవాస్తవ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆ వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి ఉన్నాడు. మా సిబ్బంది ఒక లడ్డూ ఇచ్చారు. కానీ అతను రెండో లడ్డూ కోసం గొడవపడ్డాడు. ఇవ్వకపోవడంతో నేరుగా సీఎం హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశాడు” అని తెలిపారు.
Loan Apps : లోన్ యాప్స్ ను బ్యాన్ చేయాల్సిందేనా!
సాధారణ లడ్డూ సమస్యే అయినప్పటికీ, అది నేరుగా సీఎం హెల్ప్‌లైన్‌కు చేరడంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. విషయాన్ని పెద్దదిగా మారకుండా నివారించేందుకు ఫిర్యాదు చేసిన కమలేశ్‌ను శాంతింపజేయడానికి ప్రత్యేకంగా ఒక కిలో స్వీట్లు కొనిచ్చి క్షమాపణ చెప్పాలని నిర్ణయించారు. భింద్ జిల్లాలో ఇలాంటి వింత ఫిర్యాదు ఇదే మొదటిసారి కాదు. 2020 జనవరిలో కూడా ఓ వ్యక్తి చేతి పంపు పనిచేయడం లేదని హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు.
అయితే ఆ ఫిర్యాదుపై స్పందించిన పీహెచ్ఈ అధికారి ఒకరు “ఆ వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదు” అంటూ వివాదాస్పద సమాధానం ఇవ్వడం ఆ సమయంలో వార్తల్లో నిలిచింది. సాధారణంగా ప్రజలు హెల్ప్‌లైన్‌కు కాల్ చేస్తే, అది రోడ్లు, నీరు, విద్యుత్, ఆరోగ్యం, విద్య వంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అయి ఉంటుంది. కానీ ఒక లడ్డూ ఎక్కువ కావాలని హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడం మధ్యప్రదేశ్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. “ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఇలాంటి తేలికపాటి విషయాలకు ఉపయోగిస్తే, అసలు అవసరమైన ఫిర్యాదుల ప్రాధాన్యత తగ్గిపోతుంది” అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Earthquake : దక్షిణ అమెరికాలో భారీ భూకంపం… రిక్టర్ స్కేల్‌పై 8 తీవ్రత.. సునామీ హెచ్చరిక!