Malegaon blast case : దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన 2008 మాలేగావ్ పేలుడు కేసులో ముంబయిలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా పేరుపడ్డ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం ఏడుగురు వ్యక్తులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కేసులో ఉన్న ఆధారాలు నిందితులపై అభియోగాలు రుజువు చేయడానికి సరిపోవని తేలింది. ఉగ్రవాదానికి మతం ఉండదు. ఏ మతమూ హింసను ప్రోత్సహించదు. ఊహాగానాలు, నైతిక ఊహలతో ఎవరినీ శిక్షించలేం. ఈ కేసులో బలమైన ఆధారాలు లేవు. కేవలం ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ ఆధారంగానే తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
Read Also: Prakasam District : ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
పేలుడుకు ఉపయోగించిన మోటార్‌సైకిల్ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పేరిట నమోదైందన్న ప్రాసిక్యూషన్ వాదన. ఆ బైక్ ఆమెదే అని నిర్ధారించేందుకు తగిన ఆధారాలు లేవు. అలాగే, బైక్‌లో అమర్చిన బాంబే పేలుడు సంభవించిందన్న వాదనకు కూడా నిశ్చితమైన సాక్ష్యాలేమీ లేవని తేల్చింది. ఈ పేలుడులో మృతులైన ఆరుగురు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయం అందించాలని సూచించింది.
కోర్టు తీర్పుపై మృతుల కుటుంబాలు తీవ్ర నిరాశ వ్యక్తం చేశాయి. 17 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. కానీ, నిందితుల్ని విడిపించడం బాధాకరం అంటూ హైకోర్టులో ఈ తీర్పును సవాలు చేస్తామని ప్రకటించాయి. ఇక, తనను ఈ కేసులో లాగిన కారణంగా తన జీవితం పూర్తిగా నాశనమైందని మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ చెప్పారు. 17 ఏళ్లుగా ఓ మాయ కేసులో నన్ను వేధించారు. నన్ను తప్పుడు ఆరోపణలతో జైలులో పెట్టారు. కానీ దేవుడి దయ వల్ల న్యాయం జరిగింది. నన్ను బాధపెట్టిన వారిని దేవుడే శిక్షిస్తాడు అని ఆమె అన్నారు.
2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్ పట్టణంలో ఓ మసీదు సమీపంలో ఉగ్రదాడి జరిగింది. మోటార్‌సైకిల్ బాంబుతో జరిపిన పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేసులో ప్రజ్ఞా ఠాకూర్, కర్నల్ పురోహిత్‌తో పాటు రమేశ్ ఉపాధ్యాయ్, అజయ్ రహీర్‌కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలను ప్రధాన నిందితులుగా గుర్తించారు. కేసు దర్యాప్తును ప్రారంభించిన మహారాష్ట్ర ఏటీఎస్ అనంతరం బాధ్యతను ఎన్‌ఐఏ చేపట్టింది. మొత్తం 220 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం, అందులో 15 మంది తమ ముందు ఇచ్చిన వాంగ్మూలాలకే వ్యతిరేకంగా న్యాయస్థానంలో మాట్లాడినట్లు వెల్లడించింది.
Read Also: Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు