Maldives President : మాల్దీవులు ప్రెసిడెంట్ గా చైనా మద్దతుదారుడు ఎంపిక

మాల్దీవులు ఎన్నికల్లో (Maldives Elections) ఎవరు ఓడారు.. ఎవరు గెలిచారు.. అన్నది భారతదేశానికి అత్యంత కీలకమైన విషయం.

  • Written By:
  • Updated On - October 3, 2023 / 10:26 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Maldives President : మాల్దీవులు కొత్త ప్రెసిడెంట్ గా మహమ్మ ద్ మూయిజూ ఎన్నికయ్యాడు. ఇతను పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుత మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ సోలిహ్ మీద విజయం సాధించాడు. మాల్దీవులు ఎన్నికల్లో ఎవరు ఓడారు.. ఎవరు గెలిచారు.. అన్నది భారతదేశానికి అత్యంత కీలకమైన విషయం. అతి చిన్న ద్వీపకల్పమైన మాల్దీవులు భారత్ కు దక్షిణాసియాలో అతి కీలకమైన వ్యూహాత్మక ప్రాంతం. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న మహమ్మద్ సోలిహ్ భారతదేశంతో చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. కానీ ఇప్పుడు అతనిని పరాజయం పాలు చేసి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ మూయిజూ చైనా మద్దతుదారుడు. దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి చైనా రచిస్తున్న వ్యూహాల్లో మాల్దీవుల తాజా ఎన్నికల పరిణామాలు చూడాల్సి ఉంది. ప్రస్తుతం గెలుపొందిన మహమ్మద్ మూయిజూ గతంలో మాల్దీవ్ అధ్యక్షుడిగా పనిచేసిన అబ్దుల్లా యామీన్ కి భక్తుడు. యామీన్ చైనా బంటుగా ప్రసిద్ధికెక్కినవాడు. ఈ ఎన్నికల్లో మహమ్మద్ మూయిజూ ఇండియాను మాల్దీవుల నుంచి దూరం పెట్టాలనే నినాదంతోనే గెలుపొందాడు. అతనికి చైనా అండదండలున్నాయి.

మాల్దీవులు (Maldives) కావడానికి చిన్న దీపకల్పమే. కానీ, హిందూ మహాసముద్రంలో, దక్షిణాసియాలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలకు చాలా వ్యూహాత్మకమైన దేశంగా చూడాలి. నిండా పోగేస్తే మాల్దీవుల జనాభా ఐదు లక్షల కూడా ఉండదు. 300 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆ దేశం ఉంటుంది. కానీ ఇండియా చైనా ల మధ్య ఎంతో కాలంగా కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఈ చిన్ని దీవి రెండు దేశాలకూ అత్యంత ప్రాధాన్యమైన ప్రాంతంగా మారిపోయింది. ఇప్పుడు ఈ దీవిలో ఒక చైనా మద్దతుదారుడు అధ్యక్షుడుగా గెలుపొందడం ఇండియాకు అంత క్షేమదాయకం కాదని గ్లోబల్ న్యూస్ సంస్థలు, అంతర్జాతీయ పరిణామాల విశ్లేషకులు చెప్తున్నారు.

మాల్దీవులు భారతదేశంలో మినికాయ్ ఐలాండ్ కి కేవలం 70 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంటుంది. భారత పశ్చిమ తీర ప్రాంతానికి 300 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంటుంది. భారతీయ నావికా దళాలు ప్రధానంగా గస్తీసాగించే హిందూ మహాసముద్రంలో చాలా కీలకమైన పొజిషన్ లో మాల్దీవులు ఉన్నాయి. గత అనేక శతాబ్దాలుగా భారతదేశం మాల్దీవులతో సాంస్కృతిక రాజకీయ ఎత్నిక్ సంబంధాలను నిరాఘాటంగా కొనసాగిస్తుంది. భారత్ మాల్దీవుల సంబంధాలు ఎప్పుడూ సుహృద్భావ వాతావరణం లో కొనసాగుతూ ఉండేవి. మాల్దీవులలో భారత ఉనికి చాలా బలమైంది. 2004 లో సంభవించిన సునామీ ప్రళయ కాలములో గాని, 2014లో ఏర్పడిన జల సంక్షోభం సమయంలో గానీ భారత్ మాల్దీవులను ఆదుకున్నది. 1988లో మాల్దీవులలో జరిగిన సైనిక తిరుగుబాటును అణచివేయడంలో మాల్దీవుల ప్రభుత్వానికి భారత్ సైనిక సహకారాన్ని అందించింది. మహమ్మద్ సోలిహ్ అధ్యక్షుడుగా ఉన్న ఈ ఐదేళ్ల కాలంలో భారత్ మాల్దీవుల మధ్య సత్సంబంధాలు మరింత మెరుగయ్యాయి. భారతదేశంతో అనేక ద్వెపాక్షిక ఒప్పందాలు మాల్దీవులు (Maldives) ప్రభుత్వం చేసుకున్నది. అంతేకాదు మాల్దీవులలో భారత్ సైనిక స్థావరాలు ఏర్పాటుకు సంబంధించి కూడా ఒప్పందాలు జరిగాయి.

ఈ నేపథ్యంలో మహమ్మద్ మూయిజూ చైనా అండదండలతో ఎన్నిక కావడం భారత్ కు కొంచెం ఆందోళన కలిగించే విషయమే. “ఇండియా అవుట్” అనే నినాదంతోనే ఇతను ఎన్నికల ప్రచారం సాగించాడు. మరో చైనా మద్దతుదారుడైన మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ ఈ కొత్త అధ్యక్షుడికి గురువు లాంటివాడు. యామీన్ ప్రస్తుతం 11 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతని పరిపాలన కాలంలో భారత్ కు అనుకూలమైన నాయకులను చాలామందిని జైల్లో పెట్టించాడు. ఇప్పుడు ఈ కొత్త అధ్యక్షుడు శనివారంనాడు ఎన్నికైన మరుక్షణమే యామీన్ జైలు శిక్షను గృహ నిర్బంధంగా మార్పించి తన గురుభక్తిని చాటుకున్నాడు. దక్షిణాసియాలో పట్టు సాధించడానికి చైనా సాగిస్తున్న సకల ప్రయత్నాన్ని మాల్దీవుల గత అధ్యక్షుడు సోలిహ్ తిప్పి కొట్టి భారత్ మాల్దీవుల బంధాన్ని ఎంతో పటిష్టం చేశాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చైనా ఏజెంట్ లాంటి ఈ కొత్త అధ్యక్షుడు ఎన్నిక, భారత్ చైనా సంబంధాల మధ్య ఎలాంటి కొత్త పరిణామాలు సృష్టిస్తుందో.. వాటిని ఇండియా ఎలా ఎదుర్కొంటుందో చాలా ఉత్కంఠ కలిగించే విషయమే.

Also Read:  Pakistan Inflation: పాకిస్తాన్ లో దిగజారుతున్న పరిస్థితులు.. రూ. 3000 దాటిన గ్యాస్ సిలిండర్ ధర..!