భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన ఆరోగ్యాన్ని సుదీర్ఘ కాలం ఎలా కాపాడుకుంటున్నారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. 74 ఏళ్ల వయసులో కూడా ఎప్పుడూ ఉత్సాహంగా, శక్తివంతంగా కనిపించే మోదీ అనేక ప్రజా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, విదేశీ పర్యటనలు నిర్వహిస్తూ, పార్టీ పరంగా, పాలన పరంగా విస్తృతమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా బిహార్‌లో జరిగిన ఓ సభలో ప్రధాని మోదీ తన ఆహార రహస్యాన్ని వెల్లడించారు. తాను సంవత్సరానికి 300 రోజులు మఖానాను (Makhana) ఆహారంగా తీసుకుంటానని తెలిపారు. మఖానా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సూపర్ ఫుడ్ అని, ఇది శరీరానికి తగిన శక్తిని అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వివరించారు.
మఖానా ఉత్పత్తి బిహార్‌లో ప్రధానంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బిహార్ రాష్ట్రానికి మఖానా బోర్డును ప్రకటించింది. ఈ బోర్డు ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించగా, దీని ద్వారా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మఖానా రైతులకు శిక్షణ అందించడంతో పాటు, మార్కెట్‌లో దీని విలువను పెంచేలా ఈ బోర్డు పనిచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధాని మోదీ మఖానా ప్రాధాన్యత గురించి వివరించడం, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని ప్రోత్సహించడం వల్ల, దీని వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Pawan : పవన్ కు చంద్రబాబు నెలకు రూ.50 కోట్లు ఇస్తున్నారు – దువ్వాడ ఆరోపణలు
ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రధాని మోదీని భాగల్‌పూర్ బహిరంగ సభలో మఖానాతో తయారు చేసిన ప్రత్యేకమైన దండతో సత్కరించారు. మోదీ మఖానాను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల దీని ప్రాముఖ్యత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉండటంతో, హృదయానికి మేలు చేస్తుంది, మధుమేహం నివారించడంలో సహాయపడుతుంది. అందుకే, మోదీ లాంటి వ్యక్తులు దీన్ని ప్రోత్సహించడం వల్ల, దేశవ్యాప్తంగా ప్రజలు దీన్ని ఎక్కువగా స్వీకరించే అవకాశముంది.