Marathas Reservation : ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర మొత్తం జనాభాలో దాదాపు 31 శాతం ఉండే మరాఠా కమ్యూనిటీకి 10 శాతం రిజర్వేషన్ కల్పించే ముసాయిదా బిల్లుకు సీఎం ఏక్‌నాథ్ షిండే క్యాబినెట్ ఆమోదం లభించింది. దీంతో మహారాష్ట్రలో విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ లభించనుంది. మరాఠాల రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపేందుకే ఇవాళ ప్రత్యేకంగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశమైంది. మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్(ఎంబీసీసీ) ఛైర్మన్ జస్టిస్ సునిల్ శుక్రే ఇచ్చిన నివేదిక ఆధారంగా మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join
మహారాష్ట్రలో ఆర్థికంగా వెనుబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ ఇప్పటికే అమలులో ఉంది దానివల్ల కూడా మరాఠాలే అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 52శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. తాజా మరాఠా కోటా10 శాతంతో కలిపి రిజర్వేషన్లు 62 శాతానికి చేరుకోనున్నాయి. మరాఠా కోటా బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గత దశాబ్ధ కాలంలో ఇది మూడోసారి. మరాఠా కోటా(Marathas Reservation) కోసం మనోజ్ జారంగే పాటిల్ అనే సామాజిక కార్యకర్త జాల్నా జిల్లాలో నిరాహార దీక్ష చేస్తున్న తరుణంలో క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
Also Read :IRCTC iPay Autopay : డబ్బులు కట్ కాకుండానే టికెట్.. ఐఆర్‌సీటీసీ ‘ఐపే ఆటోపే’ ఫీచర్
సర్వే నివేదిక ఏం చెప్పింది ?
- మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మరాఠా కమ్యూనిటీకి 10 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇంతకీ ఈ నివేదికలో ఏముందో చూద్దాం..
- రాష్ట్రంలో ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో 94 శాతం మంది మరాఠా వర్గానికి చెందినవారే ఉన్నారని సర్వేలో తేలింది.
- సెకండరీ, ఉన్నత విద్యలో మరాఠా కమ్యూనిటీ శాతం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠా కమ్యూనిటీకి తగిన ప్రాతినిధ్యం లేదని, కోటా అవసరమని నివేదిక తెలిపింది.
- వ్యవసాయ ఆదాయంలో క్షీణత, భూముల విభజన, యువత చదువుల కోసం పెరిగిన ఖర్చుల వల్ల మరాఠా వర్గం వారు ఆర్థికంగా బలహీనపడ్డారని సర్వేలో తేలింది.
- మరాఠాలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని నివేదిక చెప్పింది.