Ajit Pawar : ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ యూటర్న్ తీసుకున్నారు. క్రమక్రమంగా శరద్ పవార్ కుటుంబానికి ఆయన చేరువ అవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అదే విధమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. శరద్ పవార్ కుమార్తె, తన చెల్లెలు సుప్రియా సూలేపై అజిత్ పవార్(Ajit Pawar) తాజాగా చేసిన కామెంట్స్ కూడా అదే కోవలో ఉన్నాయి. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
‘‘ఈ లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి సుప్రియ సూలేపై నా భార్య సునేత్రా పవార్‌ను పోటీకి నిలపడం తప్పే. రాజకీయాలను ఇంటి వ్యవహారాల్లోకి రానివ్వకూడదు’’ అని అజిత్ పవార్ తెలిపారు. ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చెల్లెలు సుప్రియపై నా భార్య సునేత్రను పోటీకి నిలిపి తప్పు చేశాను. అలా చేయకుండా ఉండాల్సింది. ఎన్సీపీ పార్లమెంటరీ పార్టీ బోర్డులో తీసుకున్న నిర్ణయం వల్లే సునేత్రను అప్పుడు పోటీకి దింపాల్సి వచ్చింది. ఆ నిర్ణయానికి చింతిస్తున్నా’’ అని అజిత్ పవార్ కామెంట్ చేశారు.
Also Read :Shankaracharya : సాధువులను ఎవరూ కించపర్చలేరు.. చేసే పనుల వల్లే వారికి గౌరవం : జడ్జీ
‘‘రాఖీ పండుగ వేళ చెల్లెలు సుప్రియను కలుస్తారా?’’ అని విలేకరి ప్రశ్నించగా అజిత్ పవార్ బదులిస్తూ.. ‘‘ సుప్రియ ప్రస్తుతం వేరే పర్యటనలో ఉన్నారు. ఒకవేళ ఒకేచోట ఉంటే తప్పకుండా వెళ్లి కలుస్తాను’’ అని తెలిపారు. ‘‘శరద్ పవార్ సీనియర్ నేత మాత్రమే కాదు. ఆయన మా ఇంటి పెద్ద కూడా’’ అని ఆయన పేర్కొన్నారు. శరద్ పవార్‌పై బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. అధికార మహాయుతి కూటమి నేతలు కలిసి కూర్చున్నప్పుడు తప్పకుండా ఈవిషయాన్ని తెలియజేస్తానన్నారు. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా ‘జన సమ్మాన్ యాత్ర’ నిర్వహిస్తున్నారు. మహిళలకు ప్రతినెలా రూ.1,500 అందజేసే పథకాన్ని ఆయన బాగా ప్రచారం చేస్తున్నారు.