ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, పలువురు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. అరెస్టయిన వారిలో రామ్ కృష్ణ ఉపాధ్యాయ్, వీరేంద్ర ప్రసాద్ శుక్లా, తుషక్ కృష్ణ జైస్వాల్, సురేష్ కుమార్ సాహూ ఉన్నారు. అదే సమయంలో విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, లక్నో అభివృద్ధి సంస్థకు చెందిన నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యవసర సమావేశం నిర్వహించి, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదనపు ప్రధాన కార్యదర్శి అమృత్ అభిజాత్ మరియు లక్నో జోన్ అదనపు డీజీపీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో SITను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఏడు రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని సిట్‌కు ప్రభుత్వం ఆదేశించింది.
జూన్ 22న అలీగంజ్‌లోని సెక్టార్-డి ప్రాంతంలో ఉన్న యానిమేషన్ సెంటర్, పెట్ షాప్‌తో కూడిన వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు, దట్టమైన పొగ భవనాన్ని ఆవరించడంతో పలువురు లోపలే చిక్కుకుపోయారు. మృతుల్లో ఎక్కువ మంది యానిమేషన్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న యువ విద్యార్థులే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదం అనంతరం ఘటనాస్థలాన్ని పోలీసులు దిగ్బంధించారు. ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేపట్టగా, అగ్నిమాపక భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివాస ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం ప్రమాదకరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పలు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకోగా, బీజేపీ కూడా పార్టీ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
