Lottery King Case : శాంటియాగో మార్టిన్.. లాటరీ కింగ్!! లాటరీ వ్యాపారాలతో వేల కోట్లకు పడగలెత్తిన వ్యక్తి. అతడు గతంలో ఎన్నికల బాండ్ల ద్వారా దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీలకు రూ.1,300 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చాడు. దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఈక్రమంలోనే ఈ సంవత్సరం నవంబరులో శాంటియాగో మార్టిన్‌కు(Lottery King Case) చెందిన కార్యాలయాలు, నివాసాల నుంచి కీలకమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే శాంటియాగో మార్టిన్ నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి కంటెంట్‌ను యాక్సెస్ చేయకూడదని ఈడీకి ఇవాళ సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆయా పరికరాల నుంచి కంటెంట్‌ను కాపీ చేయరాదని ఆదేశించింది. ఈమేరకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈడీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read :Celebrity Restaurants 2024 : 2024లో సెలబ్రిటీలు ప్రారంభించిన రెస్టారెంట్లు ఇవే..
మనీలాండరింగ్ కేసుల్లో అభియోగాలను ఎదుర్కొనేవారికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనంపై మార్గదర్శకాలను కోరుతూ న్యూస్‌క్లిక్, అమెజాన్ ఇండియా సహా పలువురు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లను కూడా ఈ పిటిషన్‌లోనే సుప్రీంకోర్టు కలుపుకుంది. తమతమ ఎలక్ట్రానిక్ పరికరాలను దర్యాప్తు సంస్థలు యాక్సెస్ చేయకుండా చూడాలని, తద్వారా తమ ప్రాథమిక హక్కులను, గోప్యతా హక్కును పరిరక్షించాలని ఈ కేసుల్లోని పిటిషనర్లు కోరారు. ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. అందుకే ఇప్పుడు లాటరీ కింగ్‌కు చెందిన ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని ఈడీ చూడకుండా బ్రేక్ వేసింది. ఈమేరకు ఫిబ్రవరి 17న రిటర్న్ చేయదగిన నోటీసులను ఈడీకి సుప్రీంకోర్టు జారీ చేసింది. కాగా, ఈ ఏడాది నవంబరులో తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు, హర్యానాలోని ఫరీదాబాద్, పంజాబ్‌లోని లూథియానా, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలలో ఈడీ రైడ్స్ జరిగాయి. శాంటియాగో మార్టిన్, ఆయన అల్లుడు ఆధవ్ అర్జున్, ఇతర సన్నిహితులకు సంబంధించిన కనీసం 20ప్రదేశాల్లో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో దాదాపు రూ.8.8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Also Read :GST On Old Cars : పాత కార్ల సేల్స్‌పై ఇక నుంచి జీఎస్టీ ఎలా విధిస్తారంటే..
లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ నుంచి భారీగా విరాళాలు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో.. తమిళనాడులోని డీఎంకే పార్టీ ఉంది. దీనికి ఏకంగా రూ. 509 కోట్ల విరాళాన్ని మార్టిన్ ఇచ్చారు. డీఎంకేకు మేఘా ఇంజినీరింగ్ నుంచి రూ. 105 కోట్లు, ఇండియా సిమెంట్స్ నుంచి రూ. 14 కోట్లు, సన్ టీవీ నుంచి రూ. 10 కోట్ల విరాళాలు అందాయి. ఎన్నికల బాండ్ల వ్యవస్థను సుప్రీంకోర్టు ఇప్పటికే రద్దు చేసింది.