Ayodhya : ఈ ఎన్నికల్లో అయోధ్య రామమందిర అంశాన్ని బీజేపీ కీలకంగా పరిగణించింది. దీనివల్ల భారీగా ఓట్లు పడతాయని భావించింది. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. ప్రత్యేకించి అయోధ్య రామమందిరం కొలువై ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఆ రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లకుగానూ దాదాపు 40కిపైగా ఇండియా కూటమి చేతికి చిక్కాయి. సమాజ్ వాదీ పార్టీ ఒంటిచేత్తో 36కుపైగా సీట్లు సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 7 సీట్లలో లీడ్‌లో ఉంది. ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది ఫైజాబాద్ లోక్‌సభ స్థానం గురించి. అయోధ్య రామమందిరం(Ayodhya) ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంది. అక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి లల్లూసింగ్ 7 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ ముందంజలో ఉన్నారు. ఈ ఫలితాలు అందరికీ షాక్ ఇచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ కేవలం 34 స్థానాల్లోనే లీడ్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉండటంతో.. బీజేపీ 300కులోపు లోక్‌సభ సీట్లకు పరిమితం కావచ్చని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 60కిపైగా సీట్లను గెల్చుకుంది.
We’re now on WhatsApp. Click to Join
2024 ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీచేస్తున్న ప్రధాన బీజేపీ అభ్యర్థులలో నరేంద్ర మోడీ (వారణాసి), దినేష్ లాల్ యాదవ్ ‘నిరాహువా’, అరుణ్ గోవిల్, హేమ మాలిని, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, మేనకా గాంధీ, రవి కిషన్ తదితరులు ఉన్నారు. మొత్తం మీద ఉత్తర భారత దేశంలో ఇండియా కూటమి మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించిందని చెప్పొచ్చు.