డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్: (Darjeeing Landslide)శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డార్జిలింగ్ జిల్లాలోని మిరిక్, సుఖియాపోఖరి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 17 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలుచోట్ల నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్రం అన్ని రకాల సహాయ చర్యలు అందిస్తుందని హామీ ఇచ్చారు.
Also Read This:Bad Cholesterol: కొలెస్ట్రాల్‌ను తగ్గించి మన గుండెను రక్షించే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే!
వర్షాల కారణంగా డార్జిలింగ్-సిలిగుడి మధ్య రహదారి దెబ్బతింది, దుడియా ఇనుప వంతెన కూలిపోయింది. దీంతో మిరిక్, కుర్సియాంగ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బంగాల్-సిక్కిం మధ్య రహదారులు తెగిపోయాయి. ప్రయాణికులకు లావా-గోరుబతన్ స్ట్రెచ్ గుండా ప్రయాణించాలని సూచించారు.
ముర్షిదాబాద్, బిర్భూమ్, నాడియా, జల్పైగురి, కాలింపాంగ్, కూచ్ బెహార్, అలీపుర్దువార్ జిల్లాల్లో కుంభవృష్టి కొనసాగుతోంది. తీస్తా, మాల్ వంటి పర్వత నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. సిలిగుడి, టెరాయ్, డూయర్స్ ప్రాంతాల్లో కమ్యూనికేషన్, రవాణా సంబంధాలు దెబ్బతిన్నాయి.
టైగర్ హిల్, రాక్ గార్డెన్ వంటి పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. డార్జిలింగ్ టాయ్ ట్రైన్ సేవలు నిలిపివేశారు.
ఇక సిక్కింలోని అన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భూటాన్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆకస్మిక వరదల ప్రమాదం ఉన్నట్లు అంచనా వేసింది.
