Operation Akhal : కుల్గాం జిల్లా అఖల్ ప్రాంతంలో ఉగ్రవాద నిర్మూలన చర్యలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఆగస్టు 1న ప్రారంభమైన ఈ ‘ఆపరేషన్ అఖల్’లో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి. ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతాలను పూర్తిగా క్లీన్ చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం. మొదటి రోజు ఇద్దరు ఉగ్రవాదులు మట్టుపడగా, తరువాతి కాల్పుల్లో మరికొందరు హతమయ్యారు. మూడో రోజు నాటికి మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. అయితే ఇంకా ఎంతమంది దాక్కున్నారనే విషయంలో స్పష్టత లేనందున ఆపరేషన్ కొనసాగుతోంది.
RBI MPC Meet: రాఖీ పండుగకు ముందు శుభవార్త చెప్పనున్న ఆర్బీఐ.. ఏంటంటే?
భద్రతా బలగాలు ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడి చేసి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అడవులు, బంకర్లు, గృహాల్లో దాక్కున్న ఉగ్రవాదులను గుర్తించేందుకు డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ పరికరాలు వంటి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఉగ్రవాదులు ప్రతిఘటనకు ప్రయత్నిస్తున్నప్పటికీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న బలగాలు వారిని క్రమంగా ఏరి వేస్తున్నాయి. ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ గాయపడ్డాడు కానీ అతని పరిస్థితి స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తులో హతమైనవారు ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారేనని భావిస్తున్నారు. పహాల్గాం పర్యాటకులపై ఇటీవల జరిగిన దాడిలో వీరి ప్రమేయం ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఆపరేషన్‌ను అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి చొరబాటు ప్రయత్నాలు పెరుగుతున్న నేపథ్యంలో, వేసవిలో పర్యాటక ప్రాంతాలను టార్గెట్ చేయాలనే ఉగ్రవాదుల ప్రణాళికలను భగ్నం చేయడానికి భద్రతా బలగాలు మరింత దృఢమైన చర్యలు చేపడుతున్నాయి.