Site icon HashtagU Telugu

National Task Force : డాక్టర్ల భద్రతపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court

National Task Force : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను ఇటీవలే సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది.  ఈ కేసు దర్యాప్తులో ఇప్పటివరకు సేకరించిన వివరాలతో స్టేటస్ రిపోర్టును గురువారం (ఆగస్టు 22)లోగా తమకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.  మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిఫారసులు చేసేందుకు 10 మంది వైద్య ప్రముఖులతో నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ డీవై  చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం నిర్దేశించింది. వైద్యులు, ఆస్పత్రుల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై సిఫారసులు చేయనున్న ఈ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా హైదరాబాద్‌కు చెందిన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధిపతి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్‌ సభ్యులుగా ఉంటారని తెలిపింది.  అన్ని వర్గాలను ఈ టాస్క్ ఫోర్స్ సంప్రదించి నివేదిక రూపొందిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని టాస్క్ ఫోర్స్‌ను(National Task Force) సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది.

We’re now on WhatsApp. Click to Join

ఇవాళ కేసు విచారణ సందర్భంగా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూనియర్ వైద్యురాలు చనిపోయిన వెంటనే ఎందుకు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయలేదని ఆయనను ప్రశ్నించింది. ‘‘ఈ కేసులో రాత్రి 8.30 గంటలకు జూనియర్ వైద్యురాలికి అంత్యక్రియలు జరిగితే.. ఎఫ్ఐఆర్ అత్యంత ఆలస్యంగా రాత్రి 11.30 గంటలకు  ఎందుకు నమోదు చేశారు ?’’ అని కోల్‌కతా పోలీసులను సీజేఐ ప్రశ్నించారు. ‘‘కాలేజీ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు? ఈ ఘటనను ఆత్మహత్యగా ఎందుకు ఆయన చిత్రీకరించారు ?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో అంతమంది అరాచకం చేస్తుంటే పోలీసులు ఏం చేశారని దేశ సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. జూనియర్ వైద్యురాలు చనిపోయిన వెంటనే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా చేయడం.. ఆ వెంటనే మరో కాలేజీ ఆయనను ఉద్యోగంలోకిి తీసుకోవడం చకచకా జరిగిపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సందేహం వ్యక్తం చేశారు.

Also Read :MLC Kavitha : కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

కోల్‌కతా వైద్యురాలిపై జరిగిన దురాగతం గురించి విని యావత్ దేశంలోని వైద్యులు తమ భద్రత గురించి ఆందోళనలో పడ్డారని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ప్రత్యేకించి మహిళా వైద్యసిబ్బందికి పనిచేసే ప్రదేశాల్లో భద్రత లేకపోవడంపై న్యాయస్థానం  తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ మహిళలు వారి విధులకు వెళ్లలేకపోయారంటే అక్కడి పరిస్థితులు భద్రంగా లేనట్టే. మనం వారికి సమానత్వాన్ని తిరస్కరిస్తున్నట్టే లెక్క’’ అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది.

Also Read :Yuvraj Singh Biopic : త్వరలోనే యువరాజ్‌సింగ్ బయోపిక్.. ‘టీ సిరీస్’ సన్నాహాలు