Sundar Pichai : గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏఐ సమ్మిట్ సందర్భంగా మన జాతీయ మీడియాతో ఆయన కాలిఫోర్నియా నుంచి వర్చువల్ గా మాట్లాడుతూ… భారత్ తో గూగుల్ భవిష్యత్ భాగస్వామ్యం గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
పిచాయ్ వ్యాఖ్యల్లో కీలక అంశాలు:
- భారత ఏఐ ప్రయాణంలో గూగుల్ భాగస్వామి కావాలనుకుంటోంది. ఏఐ వినియోగంతో మరికొన్నేళ్లలో భారత్ మరింత ముందుకు వెళ్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఇండియాతో భాగస్వామిగా ఉండాలనే స్పష్టమైన ఆశయంతో ఉన్నాం.
- భారత్ లో మౌలిక సదుపాయాలు, స్థిరమైన పెట్టుబడులు, డేటా సెంటర్ల ఏర్పాటు, స్థానిక భాగస్వాములతో పరిశోధనలు, యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడంపై గూగుల్ దృష్టి సారిస్తోంది.
- భారత్ లో క్లౌడ్ రీజియన్ స్థాపన కోసం రిలయన్స్ జియోతో కలిసి పనిచేస్తున్నాం. రాజస్థాన్ లో 150 మెగావాట్ల పునరుత్పాదక ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాం.
- అదానీ, క్లీన్‌మాక్స్ వంటి సంస్థల భాగస్వామ్యంతో డేటా సెంటర్ల విస్తరణ జరుగుతోంది. భారత వినియోగదారుల కోసం ఏఐ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాం.
భారత మీడియాతో ఈ మేరకు అమెరికా నుంచి వర్చువల్ గా మాట్లాడిన పిచాయ్… నేడు భారత్ కు చేరుకున్నారు. ఏఐ సదస్సు కోసం భారత్ కు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శుక్రవారం ఏఐ సమ్మిట్ లో ఆయన ప్రసంగించనున్నారు.
