Site icon HashtagU Telugu

Hidma: మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

Key Maoist leader Hidma arrested

Key Maoist leader Hidma arrested

Hidma : దేశవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా గుర్తింపు పొందిన హిడ్మా చివరకు ఒడిశా పోలీసులకు చిక్కాడు. ఈ మావోయిస్టు కీలక నేతను ఒడిశా రాష్ట్రం, కోరాపుట్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో హిడ్మా హతమయ్యాడని వార్తలు వచ్చినా, అవి తప్పుడు సమాచారం అని తేలింది. అప్పటి నుండి హిడ్మా మోస్ట్ వాంటెడ్ జాబితాలో కొనసాగుతూ, ఎక్కడి సమాచారం లేకుండా సంచరిస్తూ ఉన్నాడు. తాజాగా ఒడిశాలో అరెస్టు కావడం మావోయిస్టు వ్యతిరేక చర్యలలో కీలక మలుపుగా భావిస్తున్నారు.

హిడ్మా – సామాన్య ఆదివాసీ నుంచి మావోయిస్టు టాప్ లీడర్‌గా

సుక్మా జిల్లా, జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పువ్వర్తి గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు హిడ్మా, ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. కానీ వయసు 17లోనే మావోయిస్టు ఉద్యమంలోకి ప్రవేశించాడు. 25 ఏళ్లకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) లో చేరి, ఆర్మీ స్థాయి కమాండర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం అతని వయసు 44 ఏళ్లు.

PLGA-1 బెటాలియన్ కమాండర్ – దండకారణ్య జోన్‌లో కీలక పాత్ర

హిడ్మా, PLGA–1వ బెటాలియన్‌కు కమాండర్‌గా పనిచేయడంతో పాటు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ బెటాలియన్‌ను మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. హిడ్మా ఆదేశాల మేరకే ఈ బెటాలియన్ కీలక ప్రాంతాల్లో దాడులకు దిగేది. టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్‌ను కూడా హిడ్మానే నడిపించేవాడు. ఈ దాడుల్లో చాలామంది భద్రతాదళాలు ప్రాణాలు కోల్పోయారు.

సిద్ధాంతాలకన్నా తుపాకి – హింసతో ఎదిగిన నాయకత్వం

సిద్ధాంత పాఠాలు పెద్దగా చదవకపోయినా, తుపాకి పట్టులో పారంగతుడైన హిడ్మా, మావోయిస్టు పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. పార్టీ కేంద్ర కమిటీలోకి ఆయనను తీసుకోవడంపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. సిద్ధాంతాలకు వెరిగా కేవలం హింసతో ముందుకు వచ్చాడనే ఆరోపణలు పార్టీ సానుభూతిపరుల నుంచీ వినిపించాయి. అయినా, ఆర్మీ మేనేజ్‌మెంట్‌లో అతని వ్యూహాత్మక నైపుణ్యం వల్ల హిడ్మాకు పార్టీ లోపల పట్టు బలంగా పెరిగింది.

మావోయిస్టు కేడర్లోనూ గుర్తించలేని రహస్య జీవితం

చాలా కాలం వరకూ హిడ్మా ఫోటోలు కూడా బయటకు రాలేదు. మావోయిస్టు క్యాడర్‌లో కూడా కొంతమందికే ఆయన గురించి స్పష్టమైన సమాచారం ఉండేది. భద్రతా దళాలకు ఎప్పటికప్పుడు చక్కగా తప్పించుకుంటూ, అడవులలో తనదైన నెట్వర్క్‌ను ఏర్పరచుకున్న హిడ్మా, చత్తీస్‌గఢ్‌తో పాటు ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాల్లో మావోయిస్టు చర్యలకు నేతృత్వం వహించాడు.

హిడ్మా అరెస్టు – భద్రతా దళాలకు పెద్ద విజయంగా భావన

దాదాపు మూడు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన హిడ్మా అరెస్టు కావడం భద్రతా శాఖలకు ఒక గట్టి విజయంగా భావిస్తున్నారు. మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో ఇది ఒక కీలక దశ అని అధికారులు చెబుతున్నారు. PLGA–1 బెటాలియన్‌కు నాయకత్వం వహించిన హిడ్మా, ఇప్పుడు పోలీసుల అదుపులో ఉండటంతో, భవిష్యత్‌లో మావోయిస్టు వ్యూహాల్లో మార్పులు తప్పవని నిపుణులు భావిస్తున్నారు. హిడ్మా అరెస్టుతో, మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బతగలిందని, మరిన్ని కీలక నేతలపై నిఘా మరింత గట్టిగా కొనసాగనున్నదని సమాచారం.

హిడ్మా నేతృత్వంలో జరిగిన కొన్ని ఘటనలు ఇవే..

.2010 ఏప్రిల్‌ 6న సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్‌ ప్రొటెక్షన్‌ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేసి, కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు.

.2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొత్తచెరువు దగ్గర రోడ్డు నిర్మా ణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందుపాతరతో దాడి జరిగింది. ఆ ఘటనలో 12మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లుమృతి చెందారు.

.2017 ఏప్రిల్‌ 24న ఇదే జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బుర్కాపాల్‌ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో.. 24 మంది జవాన్లు చనిపోయారు.

.2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు.

.2020 ఫిబ్రవరిలో ఇదే జిల్లా పిడిమెట అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చి, కాల్పులు జరపడంతో 12 మంది డీఆర్‌జీ జవాన్లు మృతి చెందారు. తాజాగా శనివారం జొన్నగూడెం దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు.

Read Also: Bhatti Vikramarka : భూభారతి అమలుకు సిద్ధం అవుతున్నాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క