Baba Ramdev : విశ్వ విఖ్యాత యోగా గురువు బాబా రాందేవ్.. ‘పతంజలి’ పేరుతో ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థను కూడా నడుపుతున్నారు. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా ఆచార్య బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. ఓ కేసులో వీరిద్దరికీ కేరళలోని పాలక్కడ్ జిల్లా జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్-2 కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ కేసులో ఫిబ్రవరి 1న విచారణకు హాజరు కావాలని కోర్టు బెయిలబుల్ వారెంటును జారీ చేయగా.. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణలు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, తాజాగా వారిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది.
ఏమిటీ కేసు ?
బాబా రాందేవ్(Baba Ramdev)కు చెందిన పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ‘దివ్య ఫార్మసీ’లను నిర్వహిస్తోంది. దివ్య ఫార్మసీలలో వివిధ చికిత్సల కోసం అనుసరించే వైద్యవిధానాలపై, ఔషధ ఉత్పత్తులపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా మీడియాలో యాడ్స్ (ప్రకటనలు) ఇవ్వడంతో పాటు తప్పుడు ప్రచారాలు చేశారంటూ కేరళలోని పాలక్కడ్ జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఒక కేసును నమోదు చేశారు. ‘‘తమ వైద్య ఉత్పత్తులతో హై బీపీ, షుగర్ నయం అవుతాయి అనేలా దివ్య ఫార్మసీ పత్రికల్లో, మీడియాలో ప్రకటనలు ఇచ్చింది. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ విధంగా ప్రకటనలు ఇవ్వడం అనేది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ -1954 ప్రకారం చట్టవిరుద్ధం’’ అని సదరు డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఆరోపించారు. కేరళలోని మరో 10 జిల్లాల్లో ఇవే ఆరోపణలతో దివ్య ఫార్మసీపై దాదాపు 10 కేసులు నమోదైనట్లు తెలిసింది.
- ఇదే అంశంపై ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోనూ పతంజలి దివ్య ఫార్మసీ కేసులను ఎదుర్కొంటోంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా యాడ్స్ ఇవ్వడంతో ఇప్పటికే పతంజలికి చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌ను రద్దు చేశారు. కేరళలోనూ అదే తరహాలో దివ్య ఫార్మసీలకు చుక్కెదురు అవుతుందా ? ఏం జరుగుతుంది ? అనేది కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంటుంది.