Equal Share To Daughters : కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరణించిన కుమార్తెలకు కూడా వారసత్వ ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని వెల్లడించింది. మరణించిన కుమార్తెలకు సమాన వాటాను నిరాకరిచడం రాజ్యాంగ సమానత్వ సూత్రాలకు విరుద్ధమని కామెంట్ చేసింది. ‘హిందూ వారసత్వ చట్టం’ ప్రకారం 2005 సంవత్సరానికి ముందు మరణించిన కుమార్తెలు వారసత్వ ఆస్తికి వారసులు కారని పేర్కొంటూ కర్ణాటకలోని నారగుండాకు చెందిన చన్నబసప్ప హోస్మయి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు.. కుమారుడు చనిపోయాక ఎలాగైతే తండ్రి ఆర్జించిన ఆస్తిలో హక్కు ఉంటుందో, చనిపోయిన కుమార్తెలకు కూడా అలాగే హక్కు ఉంటుందని పేర్కొంది. ఇలాంటి విషయాల్లో కుమారులు, కుమార్తెలు అనే వివక్ష ఉండకూడదని తేల్చి చెప్పింది. అందుకే కుమార్తెలకు కూడా సమాన హక్కులు కల్పించాలని జస్టిస్ సచిన్ శంకర్ మగడం నేతత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ‘‘2005కు ముందు మరణించిన మహిళలకు సమాన హక్కులను కల్పించకపోతే.. అది లింగ వివక్షను శాశ్వతం చేస్తుంది. చట్ట సవరణల ద్వారా మహిళల హక్కులను హరించలేరు’’ అని కోర్టు కామెంట్(Equal Share To Daughters) చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
గతంలో వినీతా శర్మ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఈ తీర్పు ఇచ్చే సందర్భంగా కర్ణాటక హైకోర్టు ప్రస్తావించింది. చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కుమార్తెలు ఏ పరిస్థితుల్లో చనిపోయారనే విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ‘‘తండ్రి ఆర్జించిన ఆస్తిలో హక్కు పుట్టుకతో వస్తుంది. వారు జీవించి ఉన్నారా లేదా అనే అప్రస్తుతం’’ అని ధర్మాసనం పేర్కొంది. చన్నబసప్ప అనే వ్యక్తికి నాగవ్వ, సంగవ్వ అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఇద్దరు సోదరీమణులు చనిపోయారు. అయితే వీరిద్దరికీ తన తండ్రి ఆర్జించిన ఆస్తిలో హక్కులు ఉన్నాయని నాగవ్వ, సంగవ్వ కుటుంబ సభ్యులు గడగ్ జిల్లా ప్రధాన న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తండ్రి ఆస్తిలో కుమార్తెలకూ సమాన హక్కు ఉంటుందని 2023 అక్టోబర్ 3న ఆదేశాలిచ్చింది. దీంతో హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. 2005కు ముందే నాగవ్వ, సంగవ్వ మరణించారు కాబట్టి వారికి ఆస్తిలో వాటా ఇవ్వడానికి వీలు లేదంటూ హైకోర్టులో చన్నబసప్ప అప్పీల్ పిటిషన్ వేశాడు. అయితే దాన్ని న్యాయస్థానం కొట్టేసింది.