Kargil Vijay Diwas : భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు పాకిస్థాన్ పన్నిన కుట్రకు భారత సైన్యం గట్టి బుద్ధి చెప్పిన చిరస్మరణీయ ఘట్టం. కార్గిల్ యుద్ధానికి నేటితో సరిగ్గా 26 ఏళ్లు పూర్తయ్యాయి. 1999లో పాక్ కుట్రను తుడిచిపెట్టిన భారత సైనికుల పరాక్రమాన్ని స్మరించుకుంటూ జూలై 26ను ‘కార్గిల్ విజయ్ దివస్’గా దేశం గర్వంతో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా భారత వాయుసేన అమరవీరులకు ఘన నివాళులర్పించింది. కార్గిల్ యుద్ధానికి సంబంధించిన అపూర్వ దృశ్యాలను కలిగి ఉన్న ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోను ‘ఎక్స్’ఖాతాలో షేర్ చేసిన వాయుసేన, “అమరవీరుల ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు శాశ్వత స్ఫూర్తి” అంటూ పోస్ట్ చేసింది.
The Indian Air Force pays heartfelt tribute to the valiant Warriors of the Kargil War. Their courage, sacrifice, and unwavering resolve continue to inspire a nation united in gratitude.#KargilVijayDiwas #26YearsOfKargil#OpVijay#OpSafedSagar… pic.twitter.com/PX4cZfBkYa
— Indian Air Force (@IAF_MCC) July 26, 2025
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా కార్గిల్ అమరవీరులకు గౌరవప్రదంగా నివాళులర్పించారు. కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో అసాధారణ ధైర్యంతో, దృఢ సంకల్పంతో పోరాడి ప్రాణాలను అర్పించిన అమరజవాన్లకు నా శిరస్సువంచి నివాళి. వారి త్యాగం మన సాయుధ దళాల నిబద్ధతకు నిదర్శనం. దేశం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుంది అని మంత్రి పేర్కొన్నారు.
కార్గిల్ యుద్ధ నేపథ్యం
1999 మే-జులై మధ్యకాలంలో కార్గిల్‌లో భారత సైన్యం ఓ చారిత్రక పోరాటాన్ని సాగించింది. ముజాహిదీన్‌ల వేషంలో పాకిస్థాన్ సైనికులు నియంత్రణ రేఖను దాటి, మన భూభాగంలోకి చొచ్చుకువచ్చి కీలకమైన స్థావరాలను ఆక్రమించారు. వారిని తుడిచిపెట్టేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ పేరిట బలమైన ఎదురుదాడి చేపట్టింది. బార్‌టోప్, టోల్లోలింగ్, టైగర్ హిల్ వంటి వ్యూహాత్మక శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం సైనికులు దాదాపు శూన్య డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ప్రాణాలతో పోరాడారు. ఆ ఘనత వెనుక వేలాదిమంది జవాన్ల ధైర్యం, పట్టుదల, త్యాగం ఉంది. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ భారత్ సైన్యం ధైర్యంతో ముందుకు సాగింది.
జులై 26 – శత్రు వైమానిక స్వప్నాలను తుడిచేసిన రోజు
పాకిస్థాన్ సైన్యాన్ని కార్గిల్ ప్రాంతం నుంచి పూర్తిగా వెనక్కి నెట్టినట్లు భారత ఆర్మీ జులై 26న అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి ఆ రోజును ప్రతి సంవత్సరం “కార్గిల్ విజయ్ దివస్”గా జరుపుకుంటూ అమరవీరులను స్మరించుకుంటోంది. ఈ రోజు దేశం మొత్తం వీరులకు నివాళులర్పిస్తూ, దేశ రక్షణలో వారి పాత్రను గర్వంతో గుర్తు చేసుకుంటోంది. వారు చూపిన త్యాగం, నిబద్ధత దేశ యువతకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు మన హృదయపూర్వక నమస్సులు.