Site icon HashtagU Telugu

Kargil Elections : కాశ్మీరీల కాంక్షకు అద్దం పట్టిన కార్గిల్ ఎన్నికలు

Kargil Elections Mirrored The Aspiration Of Kashmiris

Kargil Elections Mirrored The Aspiration Of Kashmiris

By: డా. ప్రసాదమూర్తి

Kargil Elections 2023 : నాలుగేళ్ల క్రితం కాశ్మీర్లో స్వయం ప్రతిపత్తిని, రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హోదాని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్ ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి గవర్నర్ చేతిలో కాశ్మీరీల భవితవ్యాన్ని పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు 5, 2019 న కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత కాశ్మీర్లో చాలా విపరీత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎంతో కాలం ఇంటర్నెట్ సేవలు అక్కడ ప్రజలకు అందుబాటులో లేవు. అక్కడ జరుగుతున్న విషయాలు కూడా బయట ప్రపంచానికి ఏ మాత్రం తెలియలేదు. ఈ విషయంలో కాశ్మీరీలు తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించమని ఆనాటి నుంచి ఈనాటి వరకు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దీని మీద సుప్రీంకోర్టు ఇటీవల విచారణ సాగించినప్పుడు ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు నిలదీశారు.

కాశ్మీర్లో తిరిగి ఎప్పుడు ఎన్నికలు జరుపుతారని, ఆ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతినిధులు అక్కడ పాలన సాగించే అనుకూల పరిస్థితులను ఎప్పుడు కల్పిస్తారని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్ర చూడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి త్వరలోనే ఎన్నికలు జరుపుతామని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చెప్పారు. ఈ నేపథ్యంలో కార్గిల్ (Kargil) కి చెందిన హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కు మొన్న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 26 సీట్లకు 22 సీట్లను నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిపి గెలుచుకున్నాయి. ఈ ఫలితాలు కాశ్మీరీల మనోగతానికి అద్దం పడుతున్నాయని మేధావులు, రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష పార్టీల వారు వ్యాఖ్యానిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాశ్మీర్ కి దశాబ్దాలుగా రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి కొనసాగుతోంది. దీన్ని నాలుగేళ్ల క్రితం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రద్దు చేసింది. అక్కడ త్వరలో ఎన్నికలు జరుపుతామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎంత చెప్పినప్పటికీ, వారి చిత్తశుద్ధి పట్ల ప్రతిపక్షాలకు, కాశ్మీర్ ప్రజలకు అనుమానంగానే ఉంది. అయితే ఇప్పుడు జరిగిన ఈ కార్గిల్ (Kargil) కౌన్సిల్ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఐక్యంగా పోటీ చేశాయి. ఒకటి రెండు సీట్లలో మాత్రం ఈ రెండు పార్టీలు స్నేహ పూర్వక పోటీకి దిగాయి. ఈ ఎన్నికల్లో బిజెపికి కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. అది కూడా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ రెండూ ఫ్రెండ్లీ కాంటెస్ట్ కు దిగిన చోట మాత్రమే. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు రెండు సీట్లలో గెలిచారు.

నేషనల్ కాన్ఫరెన్స్, దేశవ్యాప్తంగా ఏర్పాటైన ప్రతిపక్షాల కూటమి (INDIA)లో భాగస్వామ్య పార్టీగా ఉంది. ఈ ఎన్నికలలో తమకు మద్దతుగా నిలిచి తమతో చేయి కలిపి ఘనవిజయం సాధించడానికి తోడ్పాటు అందించిన కాంగ్రెస్ పార్టీకి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ ని రెండుగా విభజించిన కేంద్ర బిజెపి రాజకీయాలను కాశ్మీర్ ప్రజలు బలంగా తిప్పి కొట్టారని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ పట్ల ఏ నిర్ణయమైతే తీసుకుందో, దాన్ని కార్గిల్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరించినట్టు ఈ ఫలితాలు చెబుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అక్టోబర్ 4వ తేదీన జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపు 77% పైగా ఓటర్లు పాల్గొన్నారు.

మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈ కార్గిల్ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానంలో కాశ్మీర్ పట్ల తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి కేంద్రం చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. న్యాయమూర్తులు ప్రభుత్వ వాదనను అంగీకరించినట్టుగా కనిపించలేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కాశ్మీర్లో ఎన్నికలు జరిపి అక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎప్పుడు జరుపుతారు ఎన్నికలను చెప్పమని కూడా అడిగినప్పుడు, ఫలానా తేదీ అని ఇప్పుడు చెప్పలేము అని కేంద్రం బదులిచ్చింది. అందుకే కేంద్ర ప్రభుత్వం మనసులో జమ్మూ కాశ్మీర్ పట్ల ఎలాంటి ఉద్దేశ్యాలు ఉన్నాయో ఇంకా ఎవరికీ స్పష్టం కావడం లేదు.

అయితే ఈ కార్గిల్ ఎన్నికల ఫలితాలను చూసి, మరి కాశ్మీర్ మొత్తం ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందా.. అలా జరిగితే అధికార పార్టీకి ఎదురుదెబ్బే కదా.. అలాంటప్పుడు కాశ్మీర్లో ఎన్నికలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తుందా.. ఈ ప్రశ్నలు ఇప్పుడు కొత్తగా తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఈ కార్జల్ ఎన్నికల ఫలితాలు కేంద్రంలో బిజెపి సర్కార్ కు ఒక మేలుకొలుపు హెచ్చరికగా భావించాల్సి వస్తుంది. ఎన్నికలు జరిపితే ఫలితాలు ఎలా ఉంటాయో అర్థమైంది. ఎన్నికలు జరపకుండా యథాతథ స్థితిని మరింతకాలం కొనసాగిస్తే, దేశంలోనూ న్యాయస్థానాల్లోనూ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుందో చూడాలి. ఏది ఏమైనప్పటికీ కాశ్మీర్ ప్రజలు తమను తాము స్వేచ్ఛగా పరిపాలించుకునే అవకాశం కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారని ఈ కార్గిల్ ఫలితాలు చెబుతున్నాయి.

Also Read:  Elections Schedule Today : ఇవాళ మధ్యాహ్నమే 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌