ఉత్తర ప్రదేశ్(UP)లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్(Kannauj Railway Bridge Collapse)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నూతనంగా నిర్మాణంలో ఉన్న భవనంలో రెండో అంతస్తు పైకప్పు శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి, సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 23 మందిని శిథిలాల కింద నుంచి బయటకు తీశారు. వీరిలో 20 మందికి స్వల్ప గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Gurukulam : గురుకుల కామన్ ఎంట్రెన్స్ పరీక్ష పోస్టర్ ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
నూతన భవనం నిర్మాణంలో భాగంగా పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. భవన నిర్మాణానికి సంబంధించి అదుపు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న కూలీలు బిగ్గరగా కేకలు వేయడం , ఘటన సమయంలో భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు. అంబులెన్సులు, ఇతర వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసి గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంకా శిథిలాల కింద మరెవరైనా చిక్కుకుపోయి ఉండొచ్చనే అనుమానంతో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన కూలీలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచిస్తూ, బాధితుల కుటుంబాలకు భరోసా కల్పించారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జిల్లా మేజిస్ట్రేట్ శుభ్రాంత్ కుమార్ శుక్ల్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక ప్రాధాన్యత కూలీల రక్షణేనని స్పష్టం చేస్తూ, ఈ ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు.
