Justice BR Gavai: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ బీఆర్ గవాయ్ నియమితులు కానున్నారు. ఆయన మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్‌ను నియమించాలంటూ ఇటీవలే కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనకు వెంటనే కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది. దీంతో తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్‌ను నియమించేందుకు మార్గం సుగమం అయింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13తో ముగియనుంది.
ఆరు నెలలే సీజేఐ హోదాలో..
జస్టిస్ గవాయ్ ఈ ఏడాది నవంబరులోనే పదవీ విరమణ చేయనున్నారు. అంటే కేవలం ఆరు నెలల పాటే భారత ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ సేవలు అందిస్తారు. 2007లో మన దేశ సీజేఐగా దళిత వర్గానికి చెందిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పదోన్నతి పొందారు. మళ్లీ ఇప్పుడు ఆ అత్యున్నత న్యాయపదవిని పొందిన రెండో దళిత మేధావిగా జస్టిస్ బీఆర్ గవాయ్ నిలిచారు.
Also Read :Dogs Crematorium : ఇక కుక్కలు, పిల్లులకూ శ్మశానవాటిక.. సర్వీసుల వివరాలివీ
జస్టిస్ బీఆర్ గవాయ్ నేపథ్యం..
- జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) మహారాష్ట్రలోని అమరావతి వాస్తవ్యులు.
- ఆయన 1985లో బార్ అసోసియేషన్‌లో చేరారు.
- మహారాష్ట్ర హైకోర్టు మాజీ అడ్వకేట్ జనరల్, న్యాయమూర్తి బారిస్టర్ రాజా భోంస్లేతో జస్టిస్ బీఆర్ గవాయ్ కలిసి పనిచేశారు.
- 1987 నుంచి 1990 వరకు బాంబే హైకోర్టులో ఆయన స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
- రాజ్యాంగ చట్టం, పరిపాలనా చట్టానికి సంబంధించిన విషయాలలో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఎదుట ప్రాక్టీస్ చేశారు.
- 1992 ఆగస్టులో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆయన నియమితులయ్యారు.
- 2000లో నాగ్‌పూర్ బెంచ్‌కు ప్రభుత్వ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా జస్టిస్ బీఆర్ గవాయ్ నియమితులయ్యారు.
- ఆయన 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
- 2019 సంవత్సరంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
- సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాలో జస్టిస్ గవాయ్ అనేక చారిత్రక తీర్పులలో భాగమయ్యారు.
- కేంద్ర సర్కారు 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఈయన ఉన్నారు.
- ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలోనూ ఈయన ఉన్నారు.