Justice B.R. Gavai : పౌరుల హక్కులు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడే బాధ్యత న్యాయమూర్తులపై ఉందని, తీర్పులు వెలువరించేటప్పుడు వారికి స్వతంత్రంగా ఆలోచించే స్వేచ్ఛ ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తీర్పులపై ప్రజల అభిప్రాయాలు, విమర్శలు న్యాయ నిర్ణయాలపై ప్రభావం చూపకూడదని, న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి లోబడే పనిచేస్తుందని ఆయన హితవు పలికారు. తీర్పులు న్యాయబద్ధంగా, రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రజలు ఏం అనుకుంటారో అనే ఆలోచన తీర్పులపై ప్రభావం చూపకూడదు. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగం కలిగించగలదు అని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Devadasu : ‘దేవదాసు’ విడుదలై నేటికి 72 ఏళ్లు.. అన్నపూర్ణ స్టూడియోస్ స్పెషల్ వీడియో
భారతదేశంలో అత్యున్నతమైనది రాజ్యాంగమేనని, కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలు అన్నీ రాజ్యాంగ పరిమితుల్లోనే పనిచేయాలని ఆయన అన్నారు. పార్లమెంట్‌కు రాజ్యాంగ సవరణ అధికారం ఉన్నా, దాని మౌలిక నిర్మాణాన్ని మార్చే అధికారం లేదు. ఇది సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. మౌలిక స్వరూపం ఒకసారి నిర్ణయించబడిన తర్వాత దానిని మార్చడానికి ఏ సంస్థకూ హక్కు లేదు అని ఆయన గుర్తుచేశారు. తీర్పులు తీసుకోవడంలో వ్యక్తిగత భావాలు లేదా ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా తీర్పులివ్వడమే న్యాయమూర్తి స్వతంత్రతని నిరూపించదని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. “మన పని కేవలం అధికారాల వినియోగం కాదు. బాధ్యతతో కూడిన విధి. ప్రజల హక్కులకు రక్షణ కల్పించడం, రాజ్యాంగ విలువలను నిలబెట్టడం మాకు అప్పగించబడిన పవిత్రమైన కర్తవ్యం అని ఆయన అన్నారు.
ఆయన తన జీవితంలోని కొన్ని విశేషాలను కూడా పంచుకున్నారు. చిన్నప్పుడు ఆర్కిటెక్ట్ కావాలని కలలుగన్న తనను న్యాయవాదిగా మారాలని తండ్రి ప్రోత్సహించారని, ఆ సలహా తన జీవితాన్ని మార్చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయన తండ్రి అరెస్టు అయిపోయిన నేపథ్యంలో, ఆయన న్యాయవాదిగా స్థిరపడలేకపోయారని, అదే తనకు న్యాయ రంగంలోకి వచ్చే స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా తాను ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, నివాసం పొందే హక్కు ఒక మౌలిక హక్కుగా పరిగణించబడుతుందని చెప్పారు. ఈ తీర్పు ద్వారా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విధానాల్లో రాజ్యాంగం ముందు ప్రభుత్వం కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. తీర్పుల ద్వారా తన అభిప్రాయాలను వెలిబుచ్చటమే తన శైలి అని పేర్కొంటూ, రాజ్యాంగ నిబద్ధతకు కట్టుబడి ఉంటానని, మౌలిక హక్కుల పరిరక్షణలో ఎప్పుడూ ముందుండతానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసిన జస్టిస్ గవాయ్, న్యాయమూర్తులు తమ బాధ్యతను నిస్సంధేహంగా నిర్వర్తిస్తేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందన్నారు.
Read Also: Debt : కూటమి సర్కార్ అప్పులపై జగన్ కామెంట్స్