Site icon HashtagU Telugu

Nitish Win : విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీశ్.. ఎన్డీఏ బలం 129

Modi Nitish

Modi Nitish

Nitish Win : బిహార్‌ అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు నెగ్గింది. 129 మంది సభ్యుల మద్దతును పొంది నితీశ్ కుమార్(Nitish Win) బల నిరూపణ చేసుకున్నారు. దీంతో సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. అంతకుముందు బిహార్ అసెంబ్లీ సెంట్రల్ హాల్‌ రాజకీయ హోరును సంతరించుకుంది. విశ్వాస పరీక్షకు ముందు అసెంబ్లీలో  కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న ఆర్జేడీ నేత అవధ్ బిహారీ చౌదరిని ఆ పదవి నుంచి తప్పించాలనే తీర్మానాన్ని బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ యాదవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మెజారిటీ ఓట్లు పడటంతో అవధ్ బిహారీ చౌదరిపై వేటు పడింది. ఆ వెంటనే ఆయన స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి వెళ్లిపోయారు. దీంతో డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారీ కొత్త స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

We’re now on WhatsApp. Click to Join

విశ్వాస పరీక్ష వేళ ఆర్జేడీకి ముగ్గురు ఎమ్మెల్యేలు చేతన్ ఆనంద్, నీలం దేవి సహా మరొకరు షాకిచ్చారు. వారు ముగ్గురు జేడీయూ  వైపున కూర్చున్నారు. స్పీకర్‌ అవధ్ బిహారీ చౌదరిని పదవీచ్యుతుడిగా  చేసేందుకు జరిగిన ఓటింగ్‌లోనూ వీరు క్రాస్ ఓటింగ్ చేశారు. ఈ ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు వెళ్లి అధికార పక్షం సీట్లలో కూర్చోవడంతో ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వెంటనే వచ్చి ప్రతిపక్షం సీట్లలో కూర్చోవాలంటూ అరిచారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది.

Also Read : 1400 Jobs Cut : స్పైస్​జెట్​లో 1400 జాబ్స్ కట్.. కారణం అదే ?

గత నెలలో, విపక్షాల ఇండియా కూటమిని వదిలిపెట్టి NDA-BJP కూటమిలో నితీష్ తిరిగి చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిహార్‌ రాష్ట్రానికి తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా.. బలపరీక్షకు ముందు రోజు వరకు బిహార్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో క్యాంపు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాదాపు వారం రోజులుగా బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉన్నారు. బలపరీక్ష నేపథ్యంలో నిన్న సాయంత్రమే ఎమ్మెల్యేలు పాట్నా వెళ్లారు. కాగా, బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 129 మంది ఎమ్మెల్యేలు బీజేపీ-జేడీ(యూ) కూటమి వైపు నిలిచారు. దీంతో ప్రతిపక్ష కూటమి వైపు 114 మంది ఎమ్మెల్యేలు మిగిలారు.

Exit mobile version