Site icon HashtagU Telugu

Nehru Independence Day Speech : మొట్టమొదటి ఆగస్టు 15 వేడుకల్లో చాచా నెహ్రూ ప్రసంగం ఇదిగో

Nehru Independence Day Speech

Nehru Independence Day Speech

Nehru Independence Day Speech : మన దేశం ఆగస్టు 15న 77వ  స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది..   

ఈ తరుణంలో మనదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ తొలిసారి ఆగస్టు 15 వేడుకల్లో ఇచ్చిన ప్రసంగాన్ని ఒకసారి చదువుదాం.. విందాం..

ఆయన ఆ ప్రసంగంలో ఏం చెప్పారు ?

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మనదేశం, మన ప్రభుత్వం, మన ప్రజలు ఏవిధమైన లక్ష్యాలతో ముందుకు కదిలారు అనేది తెలుసుకుందాం.. 

Also read : Independence Day 2023: ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం థీమ్ ఏమిటి..? ఈ స్వాతంత్య్ర దినోత్సవం ఎన్నోది..?    

“చాలా ఏళ్లుగా మనం చేస్తున్న అలుపెరుగని  పోరాటాల ఫలితం ఎట్టకేలకు  వచ్చింది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది.. అర్ధరాత్రి సమయంలో యావత్  ప్రపంచం గాఢ నిద్రలో ఉండగా భారతదేశంపై స్వేచ్చా కిరణం ప్రసరించింది.. ఈ క్షణం చరిత్రలో నిలిచిపోతుంది. పాత నుంచి కొత్తలోకి.. ఒక యుగం నుంచి మరో యుగంలోకి.. అణచివేత నుంచి ఆత్మ గౌరవం నిలిపే స్వేచ్ఛలోకి  అడుగుపెట్టిన ఈ కీలక సమయంలో దేశ ప్రజల సేవ కోసం అంకితభావంతో ప్రతిజ్ఞ చేయడం సముచితం. ఈ రోజు మనం దురదృష్టకరమైన కాలాన్ని ముగించాము..  ఇకపై  భారతదేశం మళ్లీ తనను తాను కనుగొంటుంది. తన ఉనికిని చాటుకుంటుంది.. ఈ రోజు మనం జరుపుకునే విజయోత్సవం అనేది.. భవిష్యత్తులో మనం సాధించబోయే మరెన్నో గొప్ప విజయాల దిశగా ఒక అడుగును కదపడం, ఒక అవకాశానికి మార్గాన్ని తెరవడం మాత్రమే. ఈ అవకాశాన్ని గ్రహించి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడానికి మనం ధైర్యంగా, తెలివిగా ముందుకు సాగాలి.  

Also read : Beard: పురుషులకు గడ్డం ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయాల్సిందే?

దేశ ప్రజల దుఃఖాన్ని తలుచుకుంటే గుండెలు బరువెక్కుతాయ్   

స్వేచ్ఛ, అధికారం అనేవి వాటితో బాధ్యతను తెస్తాయి. దేశ సార్వభౌమాధికారానికి  ప్రాతినిధ్యం వహించే సార్వభౌమాధికార సంస్థ అయిన పార్లమెంటుపై  ఈ బాధ్యత ఉంది. స్వాతంత్ర్యం రాకముందు వరకు దేశ ప్రజలు పడిన దుఃఖాన్ని తలుచుకుంటే మన గుండెలు బరువెక్కుతాయి.  ఆ బాధల్లో కొన్ని ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. గతం ముగిసింది !! ఇప్పుడు మనకు భవిష్యత్తు స్వాగతం పలుకుతోంది !! ఆ భవిష్యత్తు అనేది సౌలభ్యం లేదా విశ్రాంతికి సంబంధించినది కాదు. ఎడతెగని కృషితో ఆ భవిష్యత్తు ఉంటుంది. కృషి ద్వారా మాత్రమే  మనం ఈ రోజు తీసుకోబోయే ప్రతిజ్ఞలను నెరవేర్చగలము. భారతదేశ సేవ అంటే కష్టాలను అనుభవిస్తున్న లక్షలాది మందికి   అందించే  సేవ. దీని అర్థం..  పేదరికం, నిరక్షరాస్యత,  వ్యాధులు, అవకాశాలలో అసమానతలను అంతం చేయడం.

ప్రతి కన్నీటిని తుడవడం మనందరి ఆశయం

ప్రతి కన్నీటిని తుడవడం మనందరి ఆశయం. ఇది మన సామర్ధ్యానికి మించిన లక్ష్యం కావచ్చు. కానీ దేశంలో కష్టాలు, కన్నీళ్లు మిగిలి ఉన్నంత కాలం మన బాధ్యత నెరవేరనట్టే. కాబట్టి మన కలలు సాకారం కావాలంటే మనం శ్రమించాలి, పని చేయాలి, కష్టపడి పనిచేయాలి..  ఆ కలల్లో మన భారతదేశానికి సంబంధించినవి.. ప్రపంచానివి కూడా ఉన్నాయి..  ఎందుకంటే ఈ రోజు అన్ని దేశాలు, అన్ని దేశాల  ప్రజలు చాలా దగ్గరగా ముడిపడి ఉంటున్నారు. వారు విడివిడిగా జీవిస్తారని అస్సలు ఊహించలేం . స్వాతంత్య్రం ఎలాగో  ఇకపై ప్రజా  శ్రేయస్సు కూడా అలాగే!! అందరికీ శ్రేయస్సు చేకూరాలి. భారత ప్రజలంతా ఈ గొప్ప సాహస యజ్ఞంలో సంపూర్ణ  విశ్వాసంతో మాతో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది చిల్లర విమర్శలు చేసే సమయం కాదు. ఇతరులను దూషించే సమయం కాదు. భారతావని పిల్లలంతా నివసించే స్వేచ్ఛా భారతానికి మనం గొప్ప భవనాన్ని నిర్మించాలి” అని చాచా నెహ్రూ తన ప్రసంగంలో(Nehru Independence Day Speech) పేర్కొన్నారు.