Baba Hamas : జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు వేళ్లూనుకుంటున్నాయి. తాజాగా మరో కొత్త ఉగ్రవాద సంస్థ ఉనికిని కశ్మీరులో గుర్తించారు. దాని పేరే.. ‘తెహ్రీక్ లబైక్ యా ముస్లిం’ (టీఎల్ఎం). ఇది పాకిస్తాన్ కేంద్రంగా నడిచే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తోందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. బాబా హమాస్ అనే పాకిస్తానీయుడు.. జమ్మూకశ్మీరులో ‘తెహ్రీక్ లబైక్ యా ముస్లిం’ (Baba Hamas) సంస్థ కార్యకలాపాలకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తున్నాడని వెల్లడైంది. ఇటీవలే గండేర్‌బల్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు చనిపోవడాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. జమ్మూకశ్మీరులోని ఉగ్రవాద సంస్థల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసేందుకు జమ్మూకశ్మీరు పోలీసులకు చెందిన కౌంటర్ ఇంటెలీజెన్స్ విభాగం (సీఐకే) ప్రస్తుతం స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది.
Also Read :Bomb Threats : హైదరాబాద్, ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
కౌంటర్ ఇంటెలీజెన్స్ విభాగం ‘సీఐకే’ గత కొన్ని గంటల్లో శ్రీనగర్, గండేర్‌బల్, బందీపొర, కుల్గామ్, బుడ్గాం, అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాల్లో ముమ్మర సోదాలు నిర్వహించింది. ‘తెహ్రీక్ లబైక్ యా ముస్లిం’ తీవ్రవాద కార్యకలాపాల కోసం పెద్దసంఖ్యలో యువతను రిక్రూట్ చేసుకుంటోందని గుర్తించారు. బాబా హమాస్ అనే పాకిస్తానీ నుంచి కశ్మీరులోని ‘తెహ్రీక్ లబైక్ యా ముస్లిం’ తీవ్రవాదులకు ఆదేశాలు అందుతున్నట్లు తేలింది. బాబా హమాస్‌కు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని భారత భద్రతా వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీరులోని తీవ్రవాదులకు బాబా హమాస్ నిధులను వివిధ మార్గాల్లో పంపుతున్నట్లు వెల్లడైంది.
Also Read :Dharani Portal : ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు ఎన్‌ఐసీకి.. ఎందుకంటే ?
ఇటీవలే జమ్మూకశ్మీరులో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు స్థానికేతర కూలీలు, ఒక వైద్యుడు చనిపోయారు. ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు కలిసి వచ్చి ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం దీనిపై ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఏ) అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఈ దాడిలో కొంతమంది స్థానికులు.. ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చని భావిస్తున్నారు.