Site icon HashtagU Telugu

Jammu Kashmir : కశ్మీరులో తొలి విడత ఓట్ల పండుగ షురూ.. ప్రధాని మోడీ కీలక సందేశం

Jammu Kashmir Assembly Elections Voting

Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో మూడు దశల అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ఇవాళ ఉదయం మొదలైంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని ఏడు జిల్లాల పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇవాళ జమ్మూ ప్రాంతంలోని మూడు జిల్లాల్లో ఉన్న 8 అసెంబ్లీ సెగ్మెంట్‌లు, కాశ్మీర్ లోయలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ప్రక్రియను(Jammu Kashmir) నిర్వహిస్తున్నారు. మొత్తం 219 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 90 మంది స్వతంత్ర అభ్యర్థులే. 23 లక్షల మంది ఓటు వేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. మిగిలిన 66 అసెంబ్లీ స్థానాలకు మరో రెండు దశల్లో సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో  పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఎన్నికల ఫలితాన్ని ప్రకటిస్తారు.

Also Read :Israel Vs Lebanon : పేలిన పేజర్లు.. 9 మంది మృతి.. 2,750 మందికి గాయాలు

జమ్మూకశ్మీరులో అసెంబ్లీ ఎన్నికలు జరగడం గత పదేళ్లలో ఇదే తొలిసారి.  జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019లో రద్దు చేశారు. ఆ తర్వాత జరుగుతున్న జమ్మూకశ్మీర్‌లో తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే.  ఆర్టికల్ 370 రద్దు తర్వాత లడఖ్‌ను జమ్మూకశ్మీర్ నుంచి వేరు చేసి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్ కూడా ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తామని బీజేపీ అంటోంది.

పెద్ద సంఖ్యలో ఓట్లు వేయండి : ప్రధాని మోడీ

జమ్మూ కశ్మీర్‌ ప్రజలు పెద్దసంఖ్యలో ఓట్లు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. ప్రత్యేకించి యువకులు, మొదటిసారి ఓటుహక్కును పొందిన వారు తప్పకుండా ఓటు వేయాలని కోరారు.

జమ్మూలో కీలక అభ్యర్థులు

జమ్మూలో ఇవాళ పోలింగ్ జరుగుతున్న అసెంబ్లీ స్థానాల నుంచి  పోటీ చేస్తున్న కీలక అభ్యర్థులలో..  మాజీ మంత్రులు సజ్జాద్ కిచ్లూ (నేషనల్ కాన్ఫరెన్స్), ఖలీద్ నజీబ్ సుహార్వర్ది (నేషనల్ కాన్ఫరెన్స్), వికార్ రసూల్ వానీ (కాంగ్రెస్), అబ్దుల్ మజీద్ వానీ (డీపీఏపీ), సునీల్ శర్మ (బీజేపీ), శక్తి రాజ్ పరిహార్ (దోడా వెస్ట్)  ఉన్నారు. గులాం మహ్మద్ సరూరి ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గులాం నబీ ఆజాద్‌కు చెందిన డీపీఏపీ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంత ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే దలీప్ సింగ్ పరిహార్ (బీజేపీ), మాజీ ఎమ్మెల్సీ ఫిర్దౌస్ తక్, ఇంతియాజ్ షాన్ (పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్సుకు చెందిన పూజా ఠాకూర్  ఈసారి పోటీ చేస్తున్నారు. కిష్త్వార్ జిల్లా అభివృద్ధి మండలి సిట్టింగ్ చైర్‌పర్సన్, బీజేపీ యువ నేత షగున్ పరిహార్ ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన తండ్రి అజిత్ పరిహార్,  మేనమామ అనిల్ పరిహార్‌లను ఉగ్రవాదులు 2018 నవంబరులో హత్య చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మెహ్రాజ్ దీన్ మాలిక్ పోటీ చేస్తున్నారు.

Also Read :Palm Rubbing Benefits: ఉద‌యం నిద్రలేవ‌గానే రెండు చేతులు రుద్దుకుంటే ఏమ‌వుతుందో తెలుసా..?

కశ్మీర్‌లో కీలక అభ్యర్థులు

కశ్మీర్‌లో ఇవాళ పోలింగ్ జరుగుతున్న అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న కీలక అభ్యర్థులలో.. సీపీఎం నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన సకీనా ఇటూ, పీడీపీకి చెందిన సర్తాజ్ మద్నీ, అబ్దుల్ రెహ్మాన్ వీరి ఉన్నారు. శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా నుంచి పీడీపీకి చెందిన ఇల్తిజా ముఫ్తీ, పుల్వామా నుంచి పీడీపీ యువనేత వహీద్ పారా పోటీ చేస్తున్నారు.