Jammu and Kashmir Elections: ఎన్నికల సంఘం ఇటీవల హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాకిచ్చేందుకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో వీరిద్దరి మధ్య పొత్తు ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. అలా కుదరకపోతే ఎన్నికల్లో విడిగా పోటీ చేసి ఆ తర్వాత కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల చర్చలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న మూడు దశల్లో ఇక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పొత్తు కుదుర్చుకుని సత్తా చాటాలని ఇరు పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి తొలగిస్తూ ఆర్టికల్ 360ని రద్దు చేసిన బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలని భావిస్తున్న ఇరు పార్టీలు త్వరలో పొత్తుపై ఓ ప్రకటన చేయబోతున్నాయి.ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి.
నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ నాయకులు శ్రీనగర్‌లో నిన్న అర్థరాత్రి సమావేశమై పొత్తుపై చర్చించారు. ఇందులో కాశ్మీర్ లోయలో 12 స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. అదే సమయంలో జమ్మూ డివిజన్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ కు 12 సీట్లను ఆఫర్ చేస్తోంది. అయితే సీట్ల పంపకంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. త్వరలో మరో దఫా చర్చలు ఉంటాయని, ఆ తర్వాత రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఈ పొత్తు ఖరారైతే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల రూపురేఖలే మారిపోతాయనే అంచనాలున్నాయి.