Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Live-in relationship  వివాహితుడైన పురుషుడు, మేజర్ అయిన మహిళతో ఆమె అంగీకారంతో సహజీవనం చేయడం నేరం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నైతికతను, చట్టాన్ని వేర్వేరుగా చూడాలని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ సహజీవన జంట తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు […]

Published By: HashtagU Telugu Desk
allahabad high court on living relationship

allahabad high court on living relationship

Live-in relationship  వివాహితుడైన పురుషుడు, మేజర్ అయిన మహిళతో ఆమె అంగీకారంతో సహజీవనం చేయడం నేరం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నైతికతను, చట్టాన్ని వేర్వేరుగా చూడాలని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ సహజీవన జంట తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

కేసు వివ‌రాల్లోకి వెళితే… షాజహాన్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల అనామిక, వివాహితుడైన నేత్రపాల్ అనే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే, జనవరి 8న అనామిక తల్లి కాంతి.. తన కుమార్తెను నేత్రపాల్ ప్రలోభపెట్టి తీసుకెళ్లాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) సెక్షన్ 87 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అనామిక, నేత్రపాల్ హైకోర్టును ఆశ్రయించారు. తామిద్దరం మేజర్లమని, ఇష్టపూర్వకంగానే కలిసి జీవిస్తున్నామని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

వాదనల‌ సందర్భంగా నేత్రపాల్‌కు అప్పటికే వివాహమైనందున, అతను మరో మహిళతో సహజీవనం చేయడం చట్టరీత్యా నేరమని యువతి కుటుంబం తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇద్దరు మేజర్లు అంగీకారంతో కలిసి జీవించినప్పుడు, అందులో నేరపూరిత కోణం ఏమీ లేదని స్పష్టం చేసింది. మేజర్ అయిన మహిళ తన ఇష్టప్రకారం నేత్రపాల్‌తో జీవిస్తున్నట్లు పోలీసులకు కూడా స్పష్టం చేసిందని గుర్తుచేసింది.

ఈ క్రమంలో తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, వారు పరువు హత్యకు పాల్పడే ప్రమాదం ఉందని జంట ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం, జంటకు భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జంట భద్రతకు స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని ఆదేశించింది. వారి ఇంటికి వెళ్లడం గానీ, ఫోన్ లేదా ఇతర మార్గాల ద్వారా సంప్రదించడం గానీ చేయవద్దని యువతి కుటుంబ సభ్యులను హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసింది.

 

  Last Updated: 27 Mar 2026, 03:19 PM IST