ISRO Vs Egyptian God of Chaos : యావత్ మానవాళిని రక్షించే అతిపెద్ద టాస్క్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టింది. ఆస్టరాయిడ్ల నుంచి భూమిని రక్షించేందుకు ఉద్దేశించిన ప్లానెటరీ డిఫెన్స్ విభాగంపై మన ఇస్రో ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈక్రమంలోనే ‘అపోఫిస్’ అనే భారీ గ్రహశకలం(ఆస్టరాయిడ్) కదలికలను అది నిరంతరం మానిటరింగ్ చేస్తోంది. ‘అపోఫిస్’ అనేది పురాతన ఈజిప్షియన్ ప్రజలు ఆరాధించిన ఒక దేవత పేరు. భయం, గందరగోళం, తత్తరపాటు కలిగినప్పుడు అపోఫిస్‌ను ప్రాచీన కాలంలో పూజించే వారట. కీలకమైన విషయం ఏమిటంటే.. అపోఫిస్ 2029 సంవత్సరం ఏప్రిల్ 13న భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. ఆ సమయంలో భూమికి ఏం జరగొచ్చు ? పుడమికి అపాయం జరగకుండా ఏం చేయాలి ? భూమికి ఎంత దూరంలో ఉండగా అపోఫిస్‌ను అడ్డుకుంటే సేఫ్ ? అనే ప్రశ్నలకు సమాధానాలను వెతకడంపై మన ఇస్రో(ISRO Vs Egyptian God of Chaos ) ఇప్పుడు రీసెర్చ్ చేస్తోంది. ఇప్పటివరకు నాసా లాంటి సంస్థలే ఆస్టరాయిడ్ల నుంచి భూమిని రక్షించే టెక్నిక్‌లపై రీసెర్చ్ చేశాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి మన ఇస్రో కూడా చేరిపోయింది.
Also Read :Dussehra 2024 : 18 శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ? వాటి ప్రాశస్త్యం ఏమిటి ?
ఇస్రోకు చెందిన నెట్‌వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ (NETRA) విభాగంలోని నిపుణుల టీమ్ అపోఫిస్‌ను చాలా నిశితంగా పర్యవేక్షిస్తోంది. మానవాళి జీవించడానికి అత్యంత అనువైన ప్రదేశం భూమి ఒక్కటే. దాన్ని కాపాడే గొప్ప యాగంలో ఇస్రో కూడా భాగమైంది. అపోఫిస్ నుంచి ఏదైనా ముప్పు ఉందని అంచనా వేస్తే ఆ సమాచారాన్ని నాసా లాంటి అన్ని ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థలకు ఇస్రో చేరవేయనుంది. వాటన్నింటితో కలిసి భూమిని రక్షించే కార్యకలాపాలను చేపట్టనుంది. ఇటీవలే ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవివరాలను ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. కాగా, అపోఫిస్ అనే ఆస్టరాయిడ్‌ను మొట్టమొదట 2004 సంవత్సరంలో గుర్తించారు. అది 2029 సంవత్సరంలో, 2036 సంవత్సరంలో భూమికి చేరువగా వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఎంత చేరువగా వస్తుందనే దానిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. అపోఫిస్ ఆస్టరాయిడ్ దాదాపు 450 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. సాధారణంగా 140 మీటర్ల వ్యాసం కంటే ఎక్కువ సైజున్న ఆస్టరాయిడ్ భూమికి చేరువగా వస్తే డేంజర్ అని చెబుతుంటారు. అలాంటప్పుడు అపోఫిస్ వల్ల భూమికి ముప్పు ఉన్నట్టే లెక్క !! అందుకే అంతలా ఇస్రో ట్రాక్ చేస్తోంది.