Site icon HashtagU Telugu

ISRO Missions : విజ్ఞానం అంగారక గ్రహానికి.. అజ్ఞానం పాతాళానికి

Isro Missions Knowledge Is For Mars. Ignorance Is For The Underworld

Isro Missions Knowledge Is For Mars. Ignorance Is For The Underworld

By: డా. ప్రసాదమూర్తి

ISRO Missions : చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టి అక్కడి నుంచి అనేక విశేషాలను దృశ్యాలు దృశ్యాలుగా మనకు పంపడం యావత్తు దేశానికే మహా సంబరంగా మారింది. చంద్రుడి సౌత్ పోల్ మీద కాలు మోపిన మొట్టమొదటి దేశంగా భారతదేశం సగర్వంగా వైజ్ఞానిక ప్రపంచంలో వెలిగిపోయింది. ఇలాంటి శాస్త్ర సాంకేతిక విజయాలు కేవలం 45 రోజుల ప్రయాణంతో సాధించినవి కాదు. అవి తరతరాల మానవమేధో మథనం ఫలితంగా మనకు అందిన అద్భుత విజయాలు. ఇలాంటి విజయాలను దేశమంతా పండుగలా జరుపుకోవడం సైన్స్ కి ఒక దేశం పట్టిన హారతిగా భావించాలి. కానీ ఈ విజయం మనలో.. మన భావితరాలలో సైంటిఫిక్ టెంపర్ మెంట్ ని పెంపుజేసి, అన్ని విషయాలలోనూ అంశాలలోనూ వైజ్ఞానిక దృష్టి కోణంతో విశ్లేషించి చూసే వివేచనా శక్తిని పెంచాలి. సైన్సు యుగాలుగా మానవజాతికి అందిస్తున్న సందేశం ఇదే.

అయితే విజ్ఞానం అంతరిక్షం వైపు దూసుకుపోతుంటే, మన అజ్ఞానం అధోపాతాళం వైపు అధోముఖంగా పయనిస్తుందా? చంద్రయాన్-3 ని సక్సెస్ ఫుల్ గా ప్రయోగించి దేశమంతా గర్వపడేలా చేసిన సైంటిస్టులు (ISRO), దేశంలో విజ్ఞానం వెల్లివిరిసే కాంతివంతమైన కాలానికి ప్రతినిధులు. అలాంటి సైంటిస్టులు మరోపక్క దేవుళ్ళు, గుళ్ళూ గోపురాలు అంటూ అతీత శక్తుల ముందు సైన్స్ మోకరిల్లేలా ప్రవర్తిస్తే , వారిని ఆదర్శంగా భావించే యువత గందరగోళంలో పడిపోదా?

చంద్రయాన్-3 సక్సెస్ వెనక శాస్త్ర సాంకేతిక నిపుణుల బృందం (ISRO) నిరంతర పరిశ్రమ, వైజ్ఞానిక మథనం ఎంత ఉందో మనకు తెలుసు. చంద్రయాన్- 2 ఎందుకు విఫలమైందో మనకు తెలుసు. ఆ పాఠాలను గుణపాఠాలుగా స్వీకరించి చంద్రయాన్-3 సక్సెస్ కు సైంటిస్టులు శ్రీకారం చుట్టారు. అలాంటి సైంటిస్టుల బృందం పనిచేసే మన అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, విద్యార్థులకు విజ్ఞాన వెలుగుదారులు చూపడంలో అన్ని విషయాలలోనూ ఆదర్శప్రాయంగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు. చంద్రయాన్ విజయం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విజయంగా ప్రపంచమంతా కీర్తిస్తున్న తరుణంలో, ఆ విజయాన్ని ఎవరో దేవుడికి, ఆయన ఆశీస్సులకి అంటగడితే అది చూసే విద్యార్థులు ఎంత గందరగోళానికి గురవుతారు? మొన్న ఇస్రో చీఫ్, ఎస్. సోమనాథ్ తిరువనంతపురంలోని భద్రకాళి గుడికి వెళ్లి పూజలు చేసి వచ్చినట్టు, వీడియోతో సహా వార్త వైరల్ అయింది. సైంటిస్టులు సైన్స్ కి పూజ చేయాలి కానీ దేవుడికి పూజ చేస్తే దేవుడు ఏం చేస్తాడు? అలా చేసేవాడయితే చంద్రయాన్ 2 ఎందుకు విఫలం చెందుతుంది? ఇట్లాంటి ప్రశ్నలకు సోమనాథ్ గారి వద్ద సమాధానాలు లేకపోవచ్చు.

మరోపక్క సూర్యుడు దగ్గరికి కొన్ని రోజులలో ఆదిత్య L1 అనే సాటిలైట్ ని పంపించడానికి అంతా రంగం సిద్ధమైంది. భారతదేశం ఇక చంద్రుడు దగ్గరకు మాత్రమే కాదు, మార్స్.. వీనస్ దగ్గరకు కూడా ప్రయాణం చేస్తుందని సోమనాథ్ గర్వంగా ప్రకటించారు. నిజంగా గర్వపడాల్సిన విషయమే. అంగారక గ్రహానికి మనం చేరుకోవడం అంటే అదొక అద్భుతమే. మరి చంద్రుడు దగ్గర మన చంద్రయాన్- 3 అడుగుపెట్టిన ప్రాంతానికి ‘శివశక్తి’ అని పేరు పెట్టడం ఏమిటి ?ఇది ఏ సైన్స్ సాధించిన ఘనవిజయాలను గౌరవించడానికి చేసిన గౌరవప్రదమైన చర్యగా భావించాలి? దీని ద్వారా మనం పిల్లలకు ఏం చెబుతున్నాము? అంతేకాదు. ప్రధాని మోడీ గారి కరుణాకటాక్షాలతో, ఆయన అందించిన గొప్ప విజన్ తో, మనం అంగారక, వీనస్ గ్రహాలను చేరుకోబోతున్నామని సోమనాథ్ గారు మీడియాతో అన్నారు. పాలకులు ప్రోత్సాహం మాత్రమే ఇస్తారు. విజయం కాదు. విజన్ ఇచ్చేది సైన్స్ మాత్రమే. ఈ మాత్రం సైంటిస్టులకు నాయకత్వం వహించే ఇస్రో అధినేతకు తెలియదా? పాలకుల మెప్పు పొందడానికి ప్రయత్నించడం ద్వారా నిధులు సాధించవచ్చు. విజన్ కాదు. విజయం సాధించడానికి ఏ దేవుడి మెప్పూ పనికిరాదు. అది కేవలం తరతరాల సైన్సు పునాదుల మీద నిర్మించబడిన శాస్త్ర సాంకేతిక విజన్ తో మాత్రమే సాధ్యమవుతుంది.

ఎవరి వ్యక్తిగతమైన నమ్మకాలు ఆచారాలు వారికి ఉంటాయి కదా, సోమనాథ్ గారు పూజలు చేసుకోవడం ఆయన వ్యక్తిగత నమ్మకం కదా, మనం ప్రశ్నించడం దేనికి, అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. సైన్స్ కీ దైవపర నమ్మకాలకీ నిత్యం సంఘర్షణ జరుగుతుంది. సైన్స్ అంతరిక్షంలోకి మనల్ని తీసుకుపోతే అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు మనల్ని అధోగతి పాలు చేస్తాయి. సైన్స్ ని నమ్ముకున్న మేధావులైనా కేవలం సైన్స్ నే నమ్మాలని, దేవుళ్ళను నమ్ముకుంటే మనకు ఒరిగేది ఏమీ లేదని చెప్పాలి. లేకపోతే భావితరాలు ఎవరిని నమ్మాలో.. దేన్ని విశ్వసించాలో తెలియక తికమకపడి, అంతరిక్షం నుంచి అధోపాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది.

Also Read:  Raksha Bandhan Mantra : కుడిచేతికే రాఖీ ఎందుకు కడతారు? రక్షాబంధన్ మంత్రం ఏమిటి ?