By: డా. ప్రసాదమూర్తి
Will BJP do Politics? : మన మనసులో ఎలాంటి మంచి భావం ఉన్నా, ఆ భావాన్ని సరిగ్గా వ్యక్తీకరించే మాటలు ప్రయోగించకపోతే అవి విపరీతార్థానికి దారితీసి మనం అల్లరి పాలయ్యే అవకాశం ఉంటుంది. బీహార్ (Bihar) ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitesh Kumar) ఇలాంటి చిక్కులోనె ఇరుక్కున్నారు. బీహార్లో క్యాస్ట్ సర్వే, ఎకనామిక్ సర్వే నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, వాటిపై చర్చ జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదల అదుపులోకి వచ్చిందని, రాష్ట్రంలో సంతానోత్పత్తి (ఫెర్టిలిటీ) రేటు 4. 3% నుంచి 2.9 శాతానికి తగ్గిందని, దీన్ని రెండు శాతానికి తీసుకువస్తామని ఆయన అన్నారు. ఇదే సందర్భంగా మహిళలకు విద్యావకాశాలు మెరుగవడం వల్ల ఇది సాధించడం కుదిరిందని నితీష్ చెప్పారు. అయితే ఇక్కడ ఆయన మాటల్లో మరొక వ్యాఖ్య కూడా చేశారు.
సెక్స్ అనేది కేవలం గర్భధారణకే కాదు, జనాభా పెరుగుదలను నియంత్రించగలమనే జ్ఞానం మహిళలకు ఎడ్యుకేషన్ వల్ల కలుగుతుందని, ఈ విషయంలో పురుషులను నియంత్రించే శక్తి కూడా విద్యావంతులైన మహిళలకు ఉంటుందని ఆయన అన్నారు. ఆయన ఉద్దేశం సరైనదే అయినప్పటికీ మాట్లాడిన మాటలు పెడార్థాలు తీయడానికి అవకాశం ఇచ్చాయి. ఈ మాటల్ని జాతీయ మహిళా కమిషన్ తప్పు పట్టింది. సభలో వెంటనే ప్రతిపక్షంలో ఉన్న BJP వారు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ మాటను పట్టుకొని నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నంత దూరం బిజెపి నాయకులు వెళ్ళిపోయారు. దీంతో నితీష్ కుమార్ సభలోను, బయట తాను చేసిన వ్యాఖ్యను, మాటలను వెనక్కి తీసుకుంటున్నానని, బేషరతుగా క్షమాపణ వేడుకుంటున్నానని మహిళా లోకానికి విన్నవించుకున్నారు.
మహిళ విద్యావంతురాలు అయితే సంతాన ఉత్పత్తి విషయంలో తనకున్న హక్కులను అధికారాలను తెలుసుకుంటుందని, అలా తెలుసుకున్న మహిళ జనాభా నియంత్రణ విషయంలో కీలకపాత్ర పోషిస్తుందని మాత్రమే తన అభిప్రాయం అని, తన మాటల వల్ల పొరపాటు అర్థాలు ధ్వనించి ఎవరి మనోభావాలయినా దెబ్బతింటే వారు క్షమించాలని నితీష్ కుమార్ బహిరంగంగా క్షమాపణ వేడుకున్నారు. అయితే నితీష్ తాను అన్న మాటల్ని వెనక్కి తీసుకున్నా, ఆ మాటలు వెనక్కి వెళ్ళకుండా ఆపడానికి బిజెపి (BJP) నాయకులు మాత్రం సర్వ విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ నితీష్ మాటలను తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల నితీష్ అసభ్యంగా మాట్లాడారని, ఈ విషయంలో సిగ్గుగా నితీష్ వ్యవహారం ఉందని ప్రధాని తీవ్రంగా నితీష్ పై విరుచుకుపడ్డారు. దీంతో దేశమంతా నితీష్ మాటల పైన పెద్ద దుమారం చాలా రేగింది.
నితీష్ (Nitesh Kumar) పై దాడి వెనుక అసలు అర్థం:
నితీష్ కుమార్ శాసనసభలో ఒక సందర్భంలో మాట్లాడిన మాటలను బిజెపి (BJP) ప్రభుత్వం అదొక జాతీయ సమస్యగా ఇప్పుడు తీర్చిదిద్దడానికి తలమునకులవుతోంది. దీని వెనక నిజంగా నితీష్ మాటలేనా.. ఇంకేమైనా రాజకీయం ఉందా.. అనే మీమాంస కూడా కొనసాగుతోంది. మంగళవారం బీహార్ (Bihar) శాసనసభలో క్యాస్ట్ సర్వే, ఎకనామిక్ సర్వే నివేదికల మీద చర్చ చేస్తూ, ఈ సర్వేల ఆధారంగా రాష్ట్రంలో రిజర్వేషన్ల నిష్పత్తిని 50% నుంచి 65 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు, దీనికి సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు నితీష్ ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశంలో రిజర్వేషన్లు 50% కంటే పెంచడానికి వీలు లేదు. కానీ బీహార్లో 65% వరకు రిజర్వేషన్ల పరిమితిని పెంచుతామన్నారు. దీనితోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మరో 10 శాతం రిజర్వేషన్ కూడా అమలు చేస్తామన్నారు. అప్పుడు మొత్తం 75 శాతానికి రిజర్వేషన్ నిష్పత్తి చేరుతుంది.
ఇది ఎలా అమలు చేస్తారు.. చట్టపరంగా ఇది ఎలా వీలవుతుంది అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. కానీ అమలు చేయడానికి సాధ్యాసాధ్యాల మాట ఎలా ఉన్నా, కులపరమైన సంఖ్య ఆధారంగా చట్టసభల్లో, ఉద్యోగాల్లో, విద్యా రంగంలో రిజర్వేషన్లు అమలు చేస్తామని నితీష్ కుమార్ చెప్పడం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. సామాజిక న్యాయం విషయంలో నితీష్ కుమార్ తమ కంటే ఎంతో దూరం ముందుకు వెళ్లిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు కులాధార జనగణన నివేదిక ప్రాతిపదిక మీద బీహార్లో నితీష్ రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి అడుగులు ముందుకు వేస్తే అది బిజెపి (BJP) ప్రభుత్వానికి చాలా గడ్డు సమస్యగా పరిణమిస్తుంది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ దూకుడును అడ్డుకోవడానికి రాజకీయంగా ఎలాంటి వ్యూహాలు పన్నాలో కొంచెం అయోమయంలో ఉన్న బిజెపి నాయకులకు ఇప్పుడు నితీష్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఆయుధాలుగా మారాయి.
బీహార్లో జరిపిన క్యాస్ట్ సర్వే దేశమంతా జరపడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు దేశమంతా కులాధార జనగణన చేసి ఆ నివేదిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు చేయడానికి అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ బిజెపి కంటే ఇతర ప్రతిపక్షాల పార్టీల కంటే చాలా ముందు ఉన్నారు. ఈ విషయంలో ఆయన వేగాన్ని అడ్డుకోవడానికి బిజెపికి మంత్రం ఏమీ కనిపించలేదు. అందుకే నితీష్ జనాభా పెరుగుదల ప్రస్తావన వచ్చినప్పుడు ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రధాన ఆస్త్రాలుగా ఇప్పుడు బిజెపి వారు ప్రయోగిస్తున్నారు. ఏది ఏమైనా ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నామో.. ఆ మాటలు ఏ అర్థాలు ఇస్తాయో.. అందరూ గుర్తురగాలి.ఒక్క మాట నోరు జారినా దాన్ని పట్టుకొని ఊరేగడానికి ప్రత్యర్థులు ఎదురుచూస్తుంటారన్న ఎరుకతో నాయకులు నిత్యం వ్యవహరించాలి. నితీష్ వ్యాఖ్యల సారం సమస్త రాజకీయ నాయకులకు అందిస్తున్న సందేశం ఇదే.
Also Read: Harish Rao: మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని తనిఖీ చేసిన పోలీసులు