రైల్లో దూరం ప్రయాణం చేసేవారికి ప్రధాన సమస్య ఫుడ్(Food). రైల్లో అందించే ఫుడ్ ఏమాత్రం బాగోదు. రుచి లేని భోజనం ఇవ్వడం వల్ల ప్రయాణికులు భోజనం చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇకపై ఆ బాధ అవసరం లేకుండా ఇకనుంచి శుభ్రమైన, రుచికరమైన భోజనం వారి సీటు వద్దే అందుబాటులోకి రానుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవను ప్రారంభించింది. గతంలో ఈ సేవలు కేవలం ప్రీమియం రైళ్లకే పరిమితమయ్యే. ఇప్పుడు సాధారణ ప్రయాణికులకు కూడా తక్కువ ధరకు నాణ్యమైన భోజనం పొందే అవకాశం లభించనుంది. అధిక ఛార్జీలు, నాసిరకం ఆహారం వల్ల ఎదురయ్యే సమస్యలకు పరిష్కారమవుతుంది.
ఈ-ప్యాంట్రీ అనేది IRCTC అందిస్తున్న డిజిటల్ ఆన్‌లైన్ ఫుడ్ బుకింగ్ సదుపాయం. మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కన్ఫర్మ్డ్, RAC లేదా పాక్షికంగా కన్ఫర్మ్ అయిన టికెట్ ఉన్న ప్రయాణికులు ఈ సేవను వినియోగించుకోవచ్చు. టికెట్ బుకింగ్ సమయంలో లేదా అనంతరం ‘బుక్డ్ టికెట్ హిస్టరీ’లో ఈ-ప్యాంట్రీ ఎంపిక చేసి ఆహారాన్ని బుక్ చేయవచ్చు. బుకింగ్ అనంతరం ప్రయాణికులకు ఒక మీల్ వెరిఫికేషన్ కోడ్ (MVC) లభిస్తుంది. ఈ కోడ్‌ను చూపించడం ద్వారా సీటు వద్దే భోజనం అందుతుంది.
ఈ సేవ ద్వారా ప్రయాణికులు ఆన్‌లైన్ ఫుడ్ బుకింగ్, డిజిటల్ పేమెంట్స్, నిర్దిష్ట ధర, IRCTC లైసెన్స్ పొందిన విక్రేతల నుండి మాత్రమే సేవల లభ్యత వంటి ప్రయోజనాలు పొందగలరు. భోజనం డెలివరీ కాకపోతే డబ్బులు తిరిగి లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సేవను వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలుతో ప్రారంభించి, రాబోయే 60 రోజుల్లో మరో 25 రైళ్లకు విస్తరించనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా మరిన్ని రైళ్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్టు IRCTC ప్రకటించింది. ఇది రైలు ప్రయాణ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే కొత్త ముందడుగు అని చెప్పవచ్చు.