Haryana Assembly Election : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని చవిచూసింది. అక్కడ ప్రజలు మరోసారి బీజేపీకే పట్టం కట్టడంతో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే, ఎన్నికల ఫలితాలపై బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ స్పందించారు. మంగళవారం ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో వచ్చిన ఫిర్యాదులపై తాను ఎన్నికల సంఘానికి తెలియజేస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం.. భారతదేశ విజయం. రాజ్యాంగ విజయం. ప్రజాస్వామ్య ఆత్మగౌరవ విజయం. హర్యానాలో వచ్చిన ఊహించని ఫలితాలపై మేము విశ్లేషిస్తున్నాం. పలు నియోజవర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల సంఘానికి తెలియజేస్తాం. హర్యానా ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన హర్యానా ప్రజలందరికీ, వారి అవిశ్రాంత కృషికీ, మా బబ్బర్ షేర్ కార్మికులకు హృదయపూర్వక ధన్యావాదాలు. మేము హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయం, సత్యం కోసం పోరాటాన్ని కొనసాగిస్తాము. మా గొంతు వినిపిస్తాము’ అని రాహుల్ గాంధీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
Read Also: PM Modi : ప్రధాని మోడీని కలిసిన హర్యానా సీఎం యాబ్ సింగ్ సైనీ
కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లను, కాంగ్రెస్ 37 సీట్లను గెలుచుకుంది. అయితే ఈ ఫలితాలను తాము అంగీకరించడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన హిసార్, మహేంద్రగర్, పానిపట్ నియోజకవర్గాల్లో ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని మెషీన్ల బ్యాటరీలు పనిచేయలేదు. కొన్ని మెషీన్లలో టచ్ చేయని యంత్రాల్లో 99 శాతం అభ్యర్థులు ఓడిపోయినట్లు చూపించాయి. ఇదెలా సాధ్యం? మరికొన్ని మెషీన్లలో అభ్యర్థులు గెలిచినట్లు చూపించాయి. లెక్కింపులు అవకతవకలు జరిగాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నియోజకవర్గాల్లో వచ్చిన ఫిర్యాదులు, తమ అభ్యర్థుల ఫిర్యాదులను త్వరలోనే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తెలిపారు. బీజేపీ గెలుపును తాము అంగీకరించబోమని, ఈ ఫలితాలు నమ్మకశక్యంగా లేవని, ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని పవన్ తెలిపారు.