Thackeray to Centre: బంగ్లాదేశ్‌లో గత కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఆమె ప్రైవేట్ విమానంలో భారత్‌కు వచ్చారు. అదే సమయంలో భారత సరిహద్దుల్లో భద్రతను పెంచారు. కాగా బంగ్లాదేశ్‌లో హిందువులపై అల్లరి మూకలు సాగిస్తున్న అకృత్యాలపై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భారత ప్రభుత్వానికి సూచనలు చేశారు.
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం ఇచ్చారని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితి అంతగా బాగాలేదని, అక్కడ హిందువులపై నిరంతరం అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు ఠాక్రే.
ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా మణిపూర్ వెళ్లడం లేదని, బంగ్లాదేశ్ వెళ్లగలిగితే బాగుంటుందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాలు జరుగుతుంటే, వాటిని అరికట్టాల్సిన బాధ్యత పూర్తిగా భారత ప్రధానిపై ఉందని వ్యాఖ్యానించారు.
బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారత్‌లో కూడా రాగలదా? ఈ ప్రశ్నకు సమాధానంగా బంగ్లాదేశ్ మన పొరుగు దేశమని అన్నారు. పాకిస్థాన్‌లో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. శ్రీలంకలో ఏం జరిగింది, ఇజ్రాయెల్‌లో ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్ని చూస్తూనే ఉన్నాం. ఇతర దేశాల్లో జరిగేది ఎక్కడైనా ఎప్పుడైనా జరగవచ్చు. అందుకే ఎవరు అధికారంలో ఉన్నా అహంకారానికి వెళ్లకూడదని పరిమితులు అతిక్రమించకూడదని హెచ్చరించారు.
Also Read: Lok Sabha : రేపు లోక్‌సభ ముందుకు రానున్న ‘వక్ఫ్ బోర్డు’ చట్ట సవరణ బిల్లు..